కొత్తపలుకు : టీఆర్‌ఎస్‌, వైసీపీకి ఓటేస్తే మోడీకి వేసినట్లేనని నేరుగా చెప్పిన ఆర్కే..!

రాజకీయాల్లో ఇప్పుడో ట్రెండ్ ప్రారంభమయింది. ఓ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిస్తే.. ఆ పార్టీతో ఇతర పార్టీలను అంటగట్టి.. ఆ పార్టీకి ఓటేస్తే… ఇతర పార్టీకి ఓటేసినట్లేనని చెబుతూ వస్తున్నారు. జాతీయ స్థాయిలో రాజకీయ వ్యవహారాల కోసం లోపాయికారీ వ్యవహారాలు నడుపుతున్న పార్టీలపై ప్రధానంగా ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. ఈ జాబితాలో.. టీఆర్ఎస్, వైసీపీ ప్రముఖంగా ఉన్నాయి. ఇదే విషయాన్ని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ .. తన వారాంతపు రాజకీయ కథనం.. కొత్త పలుకులో… కొత్తగా విశ్లేషించారు. ఏపీలో.. వైసీపీ, తెలంగాణలో టీఆర్ఎస్‌కు వచ్చే పార్లమెంట్ సీట్లు అంతిమంగా.. మోడీ ప్రధాని అవుతాయని ఉపయోగపడతాయి తప్ప… ఏ విధంగా.. ఆ సీట్లు.. తెలుగు రాష్ట్రాలకు ఉపయోగపడనే పడవని తేల్చారు. దానికి ఆయన ” ఇండియాటుడే- కార్వి, సీ వోటర్ సంస్థలు” టీఆర్ఎస్, వైసీపీని మోడీ మిత్రుల జాబితాలో వేసి మీర చేసిన సర్వేలను సాక్ష్యంగా చూపించారు. ” తెలుగునాట బీజేపీకి సొంతంగా బలం లేనందున ఆ పార్టీ అగ్రనేతలు వ్యూహాత్మకంగా ఇటు కేసీఆర్, అటు జగన్మోహన్‌రెడ్డితో అవగాహనకు వచ్చారని” తేల్చేశారు.

ఏపీ, తెలంగాణల్లో ఉన్న భిన్న రాజకీయాల్ని ఆర్కే.. స్పష్టంగా విశ్లేషించారు. ఏపీలో అది అయినా వివాదమే అవుతుంది. కానీ కేసీఆర్‌కు ఆ పరిస్థితి లేదని.. స్పష్టంగానే వివరించారు. దానికి కేబినెట్ ఏర్పాటు చేయకపోయినా.. అడిగే వారు ఒక్కరూ లేకపోవడమే ఉదాహరణగా వివరించారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అదే ఏపీలో ఇలాంటి పరిస్థితి ఉంటే.. రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని.. రాజకీయ నేతలు చెలరేగిపోయారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పని చేసిన వారు.. ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ రాజకీయం చేస్తున్నారు. కానీ తెలంగాణలో.. ఓ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారిని.. నాన్‌క్యాడర్ పోస్టులో నియమిస్తే.. అక్కడ అధికారుల్లో ఒక్కరికీ ప్రశ్నించడానికి నోరు పెగల్లేదు. ఇదే విషయాన్ని ఆర్కే… విశ్లేషించారు. తెలంగాణలో పూర్తిగా.. కేసీఆర్ నియంతృత్వ ధోరణితో తన గుప్పిట్లో అధికారాన్ని పెట్టుకున్నారని.. కానీ ఏపీలో అలా చేయడానికి చంద్రబాబుకు అవకాశం లేదని తేల్చారు.

ఏపీలో కులాల ప్రకారం.. ఓటర్లను విభజించి.. తెలుగుదేశం పార్టీని ఓడించి.. జగన్‌కు అత్యధిక లోక్ సభ సీట్లు వచ్చేలా చేయాలన్నది..కేసీఆర్ వ్యూహమని… ఆర్కే విశ్లేషించారు. అందుకే తలసానని ప్రయోగిస్తున్నారంటున్నారు. టీడీపీకి ఆయువు పట్టుగా ఉన్న బీసీల్ని టీడీపీకి దూరం చేస్తే.. తన పని సగం అయిపోయినట్లేనని కేసీఆర్ భావిస్తున్నారు. ఆందుకే ఆయన బీసీ నేతల్ని ఏపీకి పంపుతున్నారట. ముప్పేట తనపై జరుగుతున్న దాడిని ఎదుర్కోవడానికి చంద్రబాబు… సంక్షేమంపై దృష్టి పెట్టారు. వేల కోట్లు అప్పు చేసి మరీ… నగదు పంపిణీ పథకాలు ప్రవేశ పెడుతున్నారు. అంతిమంగా.. ఆర్కే టీడీపీకి అత్యధిక లోక్ సభ స్థానాలు వస్తే మాత్రమే ఏపీకి ప్రత్యేకహోదాపై ఆశలు ఉంటాయని చెప్పుకొచ్చారు. ” ఎన్నికల తరవాత కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడాలన్నా ఏపీ ప్రజలు ఇచ్చే తీర్పు కీలకం కాబోతోందన్న అంచనాలు మొదలయ్యాయి. టీడీపీకి మెజారిటీ లోక్‌సభ స్థానాలు లభిస్తే కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది. అదే జరిగితే ప్రత్యేకహోదా విషయంలో రాష్ట్రప్రజలలో మళ్లీ ఆశలు చిగురిస్తాయి” అని విశ్లేషించారు. లేకపోతే జగన్మోహన్‌రెడ్డికి మెజారిటీ లోక్‌సభ స్థానాలు లభిస్తే అవి నరేంద్రమోదీకి ఉపయోగపడే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నదని తేల్చారు. మొత్తానికి తాను అనుకున్న సందేశాన్ని ప్రజల్లోకి స్పష్టంగానే పంపారు ఆర్కే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com