ఏపీలో కరెంట్ కోతలకు పవన విద్యుతే కారణం..!!

తెలుగుదేశం పార్టీ ఓడిపోయి.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో మారిన అనూహ్య పరిస్థితుల్లో ప్రత్యక్షంగా కనిపించేది… కరెంట్ సమస్య. అంతకు ముందు లేనిది.. ఒకే సారి వచ్చి పడింది. దీంతో.. ఎక్కడ చూసినా కరెంట్ కోతలే. ఇది ప్రజల్లో అసహనానికి కారణం అవుతోంది. ఎండా కాలం కూడా లేని కోతలు… వర్షకాలం .. అదీ ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయిన.. జూలైలోనూ ఉండటంతో… సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో.. ఏపీ సర్కార్, అధికారులు ఉన్నారు. అయితే.. కరెంట్ డిమాండ్ అనూహ్యంగా పెరిగిపోయిందని.. ఉత్పత్తి సమస్యలు వస్తున్నందునే.. కరెంటో కోతలని ఏపీ ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ చెబుతున్నారు.

పవన్ విద్యుత్ ఉత్పత్తిలో సమస్యలు ఏర్పడ్డాయట..!

అసలు పవన్ విద్యుత్ వల్ల.. డబ్బులు దండగ అవుతున్నాయని.. ఏపీ సర్కార్ ఓ వైపు వాదిస్తోంది. ధర్మల్ విద్యుత్ రూ. నాలుగుకే వస్తూంటే… పవన్ విద్యుత్ ను గత సర్కార్ రూ. నాలుగున్నరకు కొంటోందని… అసెంబ్లీ సాక్షిగా గగ్గోలు పెట్టారు. అంతకు ముందు అధికారులు కూడా.. ప్రెస్ మీట్ పెట్టి… అలా కొనుగోలు చేయడం కరెక్ట్ కాదన్నారు. అలా ప్రెస్ మీట్ పెట్టిన అధికారుల్లో.. కల్లాం అజేయరెడ్డితో పాటు నాగులాపల్లి శ్రీకాంత్ కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు కరెంట్ కోతలకు… పవన్ విద్యుత్ తగినంత లేకపోవడమే కారణమని చెబుతున్నారు. సాధారణంగా రుతుపవనాలు వచ్చిన తర్వాత గాలుపు పెరిగి.. పవన్ విద్యుత్ ఉత్పత్తికి అనుకూలంగా ఉంటుందట. కానీ ఆ సారి అలా లేకపోవడం వల్ల కరెంట్ ఉత్పత్తి సమస్యలు వస్తున్నాయట. అందుకే.. కోతలట.. !

ఏపీలో కావాల్సినంత కరెంట్ ఉందన్న వాదన ఉత్తడొల్లేనా..?

ఆంధ్రప్రదేశ్‌ మిగులు విద్యుత్ సాధించిందని.. ఇప్పుడు.. అత్యధిక రేటు పెట్టి కరెంట్ కొనాల్సిన అవసరమే లేదని… అవసరమైతే అమ్ముతామని.. ఏపీ సర్కార్ చెబుతూ వస్తోంది. కానీ కరెంట్ కోతలపై.. ప్రస్తుత వివరణ చూస్తూంటే.. మాత్రం..అదంతా ఉత్తదేనని తేలిపోతోంది. ఏ మాత్రం … ఉత్పత్తిలో తేడా వచ్చినా.. అది కోతలకే దారి తీస్తోందని తేలిపోయింది. ఇక అమ్మడానికి అవకాశం ఎక్కడి నుంచి వస్తుంది. ధర్మల్ విద్యుత్ మీద ఆధారపడిపోవాలని అనుకుంటున్న ఏపీ సర్కార్ కు… బొగ్గు నిల్వలు కూడా షాకిస్తున్నాయి. అంటే.. ఏపీ ఇంకా కరెంట్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించలేదు. అయినా బయట చేస్తున్న ప్రచారం మాత్రం వేరుగా ఉంది.

ప్లానింగ్ లేకుండా రైతులకు 9గంటల విద్యుత్..!

ఓ వైపు.. గృహ అవసరాలకే.. కరెంట్ ఇవ్వలేకపోతున్నారు. అయినా ఎన్నికల హామీ అంటూ.. జగన్మోహన్ రెడ్డి.. తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ను ప్రకటించేశారు. కొన్ని ఫీడర్లలో ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేయడంతో.. మొత్తానికే తేడా కొడుతోంది. ఈ ఆవేదన.. నాగులాపల్లి శ్రీకాంత్ మాటల్లోనే కనిపిస్తోంది. ఈ సమస్యలన్నీ ఇలా ఉండగానే… కొత్తగా పీపీఏల పేరుతో.. విద్యుత్ రంగంలో వచ్చే పెట్టుబడులు కూడా రాకుండా చేస్తున్నారు. దాంతో.. అసలు సమస్య ప్రారంభమవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com