“రాష్ట్రాలుగా విడిపోదాము…అన్నదమ్ములాగా కలిసుందాము. హిందీ మాట్లాడే వారికి పది రాష్ట్రలుండగా లేనిది తెలుగువారికి రెండు రాష్ట్రాలుంటే తప్పేమిటి? చైనా పాకిస్తాన్ దేశాలతోనే మనం నదీ జలాలు పంచుకోగా లేనిదీ ఇంతవరకు కలిసున్న సాటి తెలుగు రాష్ట్రంతో పంచుకోలేమా? తెలంగాణాలో స్థిరపడిన ఆంధ్రా వాళ్ళందరిరినీ కడుపులో పెట్టుకొని చూసుకొంటాము.” రాష్ట్ర విభజకు ముందు వినబడిన మాటలివి.
కానీ ఇప్పుడు వినబడుతున్న మాటలు…రెండు ప్రభుత్వాల మధ్య జరుగుతున్న యుద్దాల గురించి మళ్ళీ వేరేగా చెప్పుకోనవసరం లేదు. ఇంతకు ముందు తెలంగాణా ఏర్పాటు కోసం పోరాటాలు, వాదోపవాదాలు జరిగాయి. కానీ తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా ఇంకా ఎందుకు ఈ గొడవలు, యుద్దాలు జరుగుతున్నాయి? అని ప్రశ్నించుకొంటే చాలా ఆసక్తికరమయిన విషయాలు బయటకొస్తాయి.
అందుకు మూడు కారణాలు కనబడుతున్నాయి. 1.మొదటిది రాష్ట్ర విభజన తరువాత కూడా తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ కొనసాగాలనుకోవడం. 2. తెలంగాణాలో తెరాస తప్ప మరొక పార్టీ ఉండకూడదనే తెరాస అధినేత ఆలోచన. 3.ఆ కారణంగా తెదేపా-తెరాసల మధ్య రాజకీయ వైరం.
తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత వైకాపాలాగే తెదేపాకూడా మూటాముల్లె సర్దుకొని వెళ్ళిపోతుందని తెరాస భావించింది. తెరాసయే కాదు ఆ తరువాత తెదేపాతో పొత్తులు పెట్టుకొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా అలాగే వాదించారు. కానీ నేటికీ తెలంగాణాలో నిలద్రొక్కుకొనేఉంది. అంతే కాదు బీజేపీతో దాని బంధం కూడా ఇంకా పటిష్టంగానే ఉంది. రాష్ట్ర విభజన తరువాత బిచాణా ఎత్తేస్తుందకొన్న తెదేపా స్థానిక సంస్థల ఎన్నికలతో సహా ప్రతీ ఎన్నికలలో తెరాసకు సవాలు విసురుతూనే ఉంది.
నిజాం నవాబుని ఆదర్శంగా భావించే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణాలో తన రాజ్యం సాగాలనుకోవడంలో పెద్ద విచిత్రమేమీ లేదు. అందుకే తెలంగాణాలో తెరాస తప్ప మరొక రాజకీయ పార్టీ ఉండకూడదనే ఆలోచనతో ఆయన ఫిరాయింపులని ప్రోత్సహిస్తూ ప్రతిపక్ష పార్టీలని క్రమంగా బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు.
కానీ ఎట్టి పరిస్థితులలో తెలంగాణాలో కూడా గట్టిగా నిలద్రొక్కుకోవాలని భావిస్తున్న తెదేపాకి కేసీఆర్ చేస్తున్న ఆ ప్రయత్నాలు సహజంగానే ఆగ్రహం కలిగించవచ్చును. అందుకే తనను తాను రక్షించుకొనే ప్రయత్నంలో తెలంగాణాలో మరింత బలపడేందుకు మరింత తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ఆ ప్రయత్నంలో రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి, రమణ, రావుల, మోత్కుపల్లి వంటి తెదేపా నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వాటిని తెరాస అధినేత జీర్ణించుకోలేకపోతున్నారని స్పష్టంగా కనబడుతోంది.
తెదేపా తన ఉనికిని కాపాడుకోవడం కోసం పోరాడుతుంటే, రాష్ట్రం నుండి తెదేపాను తుడిచిపెట్టేసేందుకు తెరాస ప్రయత్నాలు చేస్తోంది. వారి ఈ రాజకీయ వైరమే వారి ప్రభుత్వాలకు కూడా ప్రాకింది. ఆ వైరం కారణంగానే ప్రతీ సమస్యను కూడా భూతద్దంలో నుంచి చూస్తూ, గోటితో పోయేదానిని గొడ్డలి వరకు తీసుకు వెళుతున్నారు. వారి రాజకీయ వైరం కారణంగానే ఒకరికొకరు సహకరించుకోకుండా కత్తులు దూసుకొంటూ, కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారు. ఓటుకి నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసులు ఆ ప్రయత్నాలలో భాగమేనని చెప్పవచ్చును.
ఒకవేళ తెలంగాణాలో తెరాస ఆంధ్రాలో వైకాపా లేదా తెలంగాణాలో తెదేపా-బీజేపీ ఆంధ్రాలో తెదేపా లేదా తెలంగాణాలో కాంగ్రెస్, ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ లేదా వైకాపాలు అధికారంలోకి వచ్చి ఉండిఉంటే బహుశః సమస్యలు ఇంత తీవ్రమయ్యేవి కావేమో? ఈ కాంబినేషన్లలో రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఏర్పడి ఉండి ఉంటే బహుశః అన్ని సమస్యలు చర్చల ద్వారానే పరిష్కరింపబడేవేమో? కానీ పాము-ముంగీస వంటి తెదేపా-తెరాసలు ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయకపోగా ఆ సమస్యలనే ఆయుధాలుగా చేసుకొని యుద్దాలు చేస్తున్నాయి. ఆ సమస్యలకు ఎదుటవారే కారణమని నిందిస్తూ ఇద్దరు ముఖ్యమంత్రులు తమతమ రాష్ట్రాల ప్రజలలో సెంటిమెంటు రాజేసి తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకొనే ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు తెలంగాణా అభివృద్ధిని అడ్డుకొనేందుకు కుట్రలు చేస్తున్నారని తెరాస మంత్రులు ఆరోపిస్తున్నారు. తమ ప్రభుత్వాన్నే కూల్చేందుకు తెరాస నేతలు కుట్రలు పన్నుతున్నారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు.
వారి ఈ పోరాటాల కారణంగా ఇరు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఈ పరిస్థితి చూసి రెండు రాష్ట్రాలకు కొత్తగా పరిశ్రమలు తరలివచ్చేందుకు కూడా జంకుతుండటంతో అభివృద్ధి కుంటుపడుతోంది. చాలా బాధాకరమయిన విషయం ఏమిటంటే ఆ రెండు పార్టీల రాజకీయ వైరం కారణంగా రెండు రాష్ట్రాల ప్రజల మధ్య కూడా క్రమంగా దూరం పెరుగుతోంది. ‘రాష్ట్రాలుగా విడిపోయినా అన్నదమ్ముల్లా కలుసుందాము…వగైరా వగైరా మాటలన్నీ గోడమీద వ్రాసుకొన్న మాటలుగానే మిగిలిపోయాయి.
అయితే ఈ సమస్యలకు పరిష్కారమే లేదా అంటే ఉన్నాయి…తెదేపా-తెరాసలు మళ్ళీ పొత్తులు పెట్టుకోవలసి ఉంటుంది లేకుంటే తెలంగాణాలో తెదేపాను పూర్తిగా తుడిచిపెట్టేయాలనే ప్రయత్నాలను కేసీఆర్ విరమించుకోవలసి ఉంటుంది. లేదా ప్రజలే పైన చెప్పుకొన్న కాంబినేషన్లలో రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. అంతవరకు ఈ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు లేవనే భావించవచ్చును.