జగన్‌ను “కొందరివాడు”గా చేయడం వల్లే డల్లాస్‌లో డల్..!

రాజ్యంలో ప్రజలందరూ.. తలా ఓ గ్లాస్ పాలు తెచ్చి పోసి… డ్రమ్మును నింపమని.. ఆదేశిస్తాడు ఓ రాజు. ఆ రాజు ఆ ప్రజల సంక్షేమానికి చేసింది సున్నా. అయినా రాజు ఆదేశించాడు కాబట్టి తప్పదు.. ప్రజలందరూ… తలా ఓ చెంబుతో తీసుకెళ్లి.. డ్రమ్ములో పోసి వచ్చారు. తీరా చూస్తే ఆ డ్రమ్ములో.. నీళ్లే ఉన్నాయి. అందరూ పాలే పోస్తారు కదా.. నేను ఒక్కర్నే నీళ్లు పోస్తే ఎవరు గుర్తు పడతారులే.. అని అందరూ అనుకున్నారు.. అచ్చం రాజు లాంటి ఆలోచనే..! … అందుకే.. చుక్క పాలు రాలేదు కానీ..డ్రమ్ము నీళ్లొచ్చాయి..! … అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సభ డల్‌గా ముగిసిపోవడానికి కారణం కూడా.. అచ్చం ఇలాంటిదే. వైసీపీ మద్దతు దారులు.. అందరూ.. బాధ్యత తమదంటే.. తమదని గొప్పగా ప్రకటించుకున్నారు. కానీ.. అందరూ.. ఒకరు తెస్తారు కదా.. అని మరొకరు లైట్ తీసుకున్నారు. ఫలితంగా… అసలు బాధ్యత తమదే అని ప్రకటించుకున్న వారు తప్ప.. అక్కడెవరూ కనిపించలేదు.

తానా సభల్ని మించేలా చేయాలని అనుకున్నారట..!

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికాకు వస్తున్న జగన్ కు.. తమ బలం ఏమిటో చూపించాలని ఎన్నారై వైసీపీ అభిమానులు… పట్టుదల ప్రదర్శించారు. డల్లాలో హచిసన్ కన్వెన్షన్ సెంటర్ ను బుక్ చేసి.. వైసీపీ అగ్రనేతలకు చూపించారు. అందులో.. పదివేల సీటింగ్ సామర్థ్యం ఉంటుందని.. ఫుల్ చేయడమే కాకుండా.. బయట కూడా జనాలు ఉండేలా చూసి.. కొన్నాళ్ల కిందట జరిగిన తానా సభలను.. మించి అద్భుతంగా ఈవెంట్ జరిగిందని… నిరూపిస్తామని హమీ ఇచ్చారు. దానికి వైసీపీ నేతలు ఖుషీ అయిపోయారు. గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే.. అలా చెప్పిన వాళ్లు.. తానా సభకు వచ్చినట్లుగా.. పన్నెండు వేల మందిని తీసుకు రావడంలో విఫలమయ్యారు. కేవలం… మూడున్నర వేలకే పరిమితమయ్యారు.

తానాకు టిక్కెట్..! డల్లాస్లో ఫ్రీ అయినా డల్..!

తానా సభలకు పన్నెండువేల మందికి పైగా వచ్చారు. కానీ ఒక్కరంటే.. ఒక్కరికీ ఫ్రీ ఎంట్రీ లేదు. అందరూ డాలర్లు కట్టే వెళ్లారు. డాలర్లు రేట్లుగా నిర్ణయిస్తే… ఎవరూ రారని.. జగన్ ఈవెంట్ నిర్వహకులు ముందుగానే నిర్ణయించుకున్నారు. క్రెడిట్ తమకే దక్కాలని.. ఆశించిన కొంత మంది… చందాలు పోగేసుకున్నారు. జగన్ దృష్టిలో పడాలన్న ఉద్దేశంతో చాలా మంది.. భారీగా విరాళాలు ఇచ్చారు. ఈవెంట్ కోసం.. మూడున్నర లక్షల డాలర్లను ఖర్చు పెట్టారు. కన్వెన్షన్ సెంటర్ , పార్కింగ్, మీల్స్ ఇలా… చాలా వాటికి ఖర్చు పెట్టారు. ఇక చాలా మంది సమీపంలో తెలుగువారు ఉండే సిటీల నుంచి ప్రత్యేకంగా బస్సులు పెట్టారు. ఆ బస్సులు చాలా వరకూ ఖాళీగా వచ్చాయి. అనేక మంది… ముందుగా వస్తామని సదరు నిర్వాహకులు హమీ ఇచ్చినప్పటికీ… చివరికి… ఈవెంట్ లో మాత్రం కనిపించలేదు.

జగన్ని కొందరివాడిని చేయడంతోనే అసలు సమస్య..!

పేనుకు పెత్తనం ఇస్తే.. తలంతా గొరిగినట్లుగా… డల్లాస్ ఈవెంట్.. వైసీపీ వ్యవహారాల విషయంలో.. ఒక వర్గానికే ప్రాధాన్యం ఇవ్వడం.. అధికారం వచ్చిన తర్వాత వారంతా.. ఇతర వర్గాలను కించ పరిచేలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జగన్ సీఎం అయిన తర్వాత.. ఒకే సామాజికవర్గం వారు… తమకు ఎలాంటి పనులైనా ఏపీలో జరిగిపోతాయన్నట్లుగా.. ఇతరులకు.. తమ మీద ఆధారపడాల్సిందేనన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. జగన్ అమెరికా టూర్ ఖరారయిన తర్వాత… ఏర్పాట్లలో కానీ.. ఇతర విషయాల్లో కానీ ప్రతీ చోటా… ఒక వర్గమే కనిపించింది. దాంతో.. మిగిలిన వారు.. సైలెంటయిపోయారు. అభిమానం ఉన్నా దూరంగా ఉండిపోయారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు.. ముందుగానే డల్లాస్ వచ్చిన వైసీపీ నేతలూ ప్రయత్నించలేదు. వారూ .. ఒక వర్గం మద్దతు చాలన్నట్లుగా వ్యవహరించారు. చివరికి సీఎంగా అందరివాడుగా ఉండాల్సిన జగన్… కొందరివాడిగా మారడంతోనే డల్లాస్ ఈవెంట్ డల్ అయిందనేది.. అంతిమంగా… పోస్ట్ మార్టంలో తేలిన విషయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com