ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలతో ముంబై నగరం తడిసిముద్దైంది. 107ఏళ్లనా టి వర్షపాతం రికార్డ్ ను బ్రేక్ చేస్తూ వర్షం దంచికొట్టడంతో జనజీవనం స్తంభించింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పలు చోట్ల రాకపోకలు కూడా నిలిచిపోయాయి.
ఈ వర్షం కారణంగా ముంబైలోని అనేక లోతట్టు ప్రాంతాలతో పాటు రైల్వే ట్రాక్‌లు నీటితో నిండిపోయాయి. దాంతో ఉదయం రోడ్లు, స్థానిక రైలు సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సెంట్రల్ రైల్వే నెట్‌వర్క్‌లోని మసీదు, బైకుల్లా, దాదర్, మాటుంగా, బద్లాపూర్ రైల్వే స్టేషన్లలో భారీ వర్షాల కారణంగా ట్రాక్‌లు నీట మునిగాయి.
భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ ప్రజలకు బిగ్ అలర్ట్ ఇచ్చింది. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచించింది. అయితే, రాబోయే గంటల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాతో..లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.