ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంలో ప్రత్యక్షంగా పాలు పంచుకుని .. విదేశాల్లో తల దాచుకుంటున్న అందర్నీ పట్టుకుని లాక్కొచ్చేందుకు సిట్ మరో అడుగు ముందుకేసింది. వారికి అరెస్టు వారెంట్లను జారీ చేయాలని కోర్టును ఆశ్రయించింది. కోర్టు అనుమతించి వారికి అరెస్టు వారెంట్లు జారీ చేసింది. ఇప్పుడు సిట్ ఆ పన్నెండు మందిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయనుంది. వారు ఎక్కడ ఉన్నా..ఆయా దేశాలు డిపోర్టు చేస్తాయి. ఏ ఎయిర్ పోర్టుకెళ్లినా పట్టుకుంటారు.
ఈ పన్నెండు మంది పాత్రధారులు మాత్రమే. వీరు దొరికితే తమ దొంగతనం బయటపడుతుందని కీలక నేతలు వీరిని విదేశాలకు పంపేశారు. వీరిలో ఎక్కువ మంది దుబాయ్ లో ఉంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి , సైఫ్ అహ్మద్, పురుషోత్తం వరుణ్ కుమార్, బొల్లారం శివకుమార్, సైమన్ ప్రసన్*, ప్రద్యుమ్న, అవినాష్ రెడ్, అనిరుధ్ రెడ్డి వంటి వారు ఈ జాబితాలో ఉన్నారు. వీరంతా లిక్కర్ స్కామ్ నగదు వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించారు. సూట్ కేసు కంపెనీలు పెట్టి.. మనీలాండరింగ్ చేశారు. వీరందరిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి.. అరెస్టు చేసి తీసుకు రానున్నారు.
విదేశాలకు పరారైన 12 మందిలో ఎనిమిది మంది దుబాయ్ లో, నలుగురు థాయ్‌లాండ్‌లో దాక్కున్నట్లు గుర్తించారు. వేల కోట్ల నగదును అత్యంత పకడ్బందీగా షెల్ కంపెనీలు, హవాలా లావాదేవీలు, విదేశీ బ్యాంకు ఖాతాల ద్వారా లాండరింగ్ చేశారు. ఇప్పటికే పక్కా టెక్నికల్ సాక్ష్యాలతో కోర్టులో ప్రాథమిక చార్జిషీటు దాఖలు చేశారు. వీరి అరెస్టు తర్వాత .. తుది చార్జిషీటు దాఖలు చేసే అవకాశం ఉంది.