మీరు మా దగ్గర ఫామ్ ప్లాట్ కొనండి అందులో ఎర్రచందనం, శ్రీచందనం మొక్కలు పెంచి.. కుప్పలుతెప్పలుగా లాభాలు తెచ్చి పెడతాం అని నమ్మించి ప్లాట్లు అమ్మేసేవాళ్లు చాలా మంది మన చుట్టూ ఉన్నారు. కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ఎర్రచందనం చెట్ల పెంపకం ద్వారా అధిక లాభాలను హామీ ఇస్తాయి. వారు చెప్పే ఆకర్షణీయమైన ఆఫర్లలో ఏ మాత్రం విలువ లేని ఉపయోగపడని భూమిని అంటగడుతున్నాయి.
ఈ భూములు వ్యవసాయ భూములుగా ఉంటాయి, కానీ వీటిని గుంటలుగా (121 చ. గజాలు) విభజించి అమ్ముతారు, ఇది చట్టవిరుద్ధం. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (RERA) లేదా స్థానిక సంస్థల నుండి అనుమతులు లేకుండా ఇలాంటి అమ్మకాలు జరుగుతాయి. ఎర్రచందనం చెట్ల అమ్మకం గురించి హామీ ఇచ్చినప్పటికీ, ఈ చెట్లు నిజంగా పెంచుతారన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇవి అన్ని రకాల వాతావరణాల్లో పెరగవు. అలా పెరిగే పని అయితే అందరూ పెంచుకుంటారు. అలాగే వాటిని అమ్మడం కూడా సాధ్యం కాదు. ఎర్రచందనం అమ్మకం కఠినమైన చట్టాలకు లోబడి ఉంటుంది,
కొందరు రియల్టర్లు రైతు బంధు, రైతు బీమా వంటి ప్రభుత్వ పథకాలను ఉపయోగించి కొనుగోలుదారులను ఆకర్షిస్తారు, అయితే ఈ పథకాలు గుంటల భూములకు వర్తించవు. హైదరాబాద్ సమీపంలోని షామీర్పేట్, ఘట్కేసర్, శంషాబాద్ వంటి ప్రాంతాల్లో వ్యవసాయ భూములను గుంటలుగా విభజించి, ఎర్రచందనం పెంపకం హామీలతో అమ్మారు. అక్కడ ఇప్పుడు ఎర్రచందనం చెట్లను పెంచడం లేదు. ఫామ్ ల్యాండ్ పేరుతో హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్, ఘట్కేసర్ వంటి ప్రాంతాల్లో ఇలాంటి స్కామ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి, ఇలాంటి పెట్టుబడులకు ముందు పూర్తి జాగ్రత్త వహించి, చట్టబద్ధమైన ధృవీకరణ చేసుకోవడం మంచిది.