భారత ప్రభుత్వం జనగణన కోసం ఏర్పాట్లు చేస్తోంది. రూ. 12 వేల కోట్ల వరకూ బడ్జెట్ కేటాయించింది. పూర్తి డిజిటల్ విధానంలో తప్పుల్లేకుండా శరవేగంగా పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో జనగణన అనేది.. నెలల తరబడి చేసే ప్రక్రియ కాదు. ఈ జనగణనతో పాటు కులగణన కూడా చేస్తారు. వెంటనే నియోజకవర్గాల పునర్విభజన ఉండే అవకాశం ఉంది. కేంద్రం అధికారికంగా చెప్పడం లేదు. కానీ రాజ్యాంగం ప్రకారం నియోజకవర్గాల పునర్విభజనకు ఉన్న క్యాప్ వచ్చే ఏడాదితో ముగిసిపోతుంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా పునర్విభజన చేయాల్సి ఉంటుంది. కేంద్రం ఆ సమస్యను పొడిగించుకునే అవకాశాలు లేవు.
లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనకు సన్నాహాలు
లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనకు చాలా చాలా కాలంగా సన్నాహాలు జరుగుతున్నాయి. చర్చలు జరుగుతున్నాయి కానీ అన్నీ అంతర్గతంగానే ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన అయితే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందన్న రాజకీయం కూడా ప్రారంభమయింది. కానీ జనాభా ఒక్కటే ప్రాతిపదిక కాదని.. ఎవరికీ అన్యాయం జరగదని కేంద్రం చెబుతోంది. ప్రస్తుతం ఉన్న నిష్పత్తిలోనే అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తూ.. సీట్ల విభజన చేయాలనుకుంటోంది. సెన్సెస్ తో పాటు కులగణన కూడా చేస్తున్నందున ఇక రిజర్వుడు సీట్ల విషయంలోనూ ఇబ్బందులు ఉండవు. 2027 మార్చికల్లా జనగణన, కులగణన పూర్తి చేస్తే 2028లో నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేస్తారు. 2029లో ఎన్నికలు నిర్వహిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో సీట్లు పెంచక తప్పదు !
విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచాల్సి ఉంది. గతంలో కొంత ప్రక్రియ జరిగినా రాజ్యాంగసవరణ అవసరం అని తేలడంతో 2026 తర్వాతనే చేయాలని నిర్ణయానికి వచ్చారు. వచ్చే ఎన్నికల నాటికి రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఖాయమని అధికార పార్టీలు ఓ భావనకు వస్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు బయటకు సంకేతాలు ఇవ్వకపోయినా.. పెరుగుతున్న సీట్లకు అనుగుణంగా లీడర్లను రెడీ చేసుకుంటున్నారని చెబుతున్నారు. తెలంగాణ రాజకీయ పార్టీలు ప్రస్తుతం అంత దూరం ఆలోచించడం లేదు. కేంద్ర ప్రభుత్వం గతంలో మహిళా రిజర్వేషన్ల చట్టం చేసింది. కానీ దాని అమలు .. కొత్తగా చేయబోయే జనగణన మీద ఆధారపడి ఉంటుంది. ఆ వివరాలన్నీ బయటకు వస్తే మహిళా రిజర్వేషన్లు అమలు చేయడానికి మార్గం సుగమం అవుతుంది.
గెలుపు ఖాయమనుకుంటే చేసి తీరుతారు !
నియోజకవర్గాల పునర్విభజన వల్ల లాభం జరుగుతుందా..నష్టం జరుగుతుందా అని బీజేపీ అగ్రనాయకత్వం పరిశీలించుకుంటుంది. మరోసారి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అనిపిస్తే ఆలస్యం చేసే అవకాశం ఉండదు. 1994లో పునర్విబజన జరిగినప్పుడు ఏపీలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. 1999లో విభజన స్థానాలు అమల్లోకి వచ్చాయి. ఆ సమయంలో విభజన .. కాంగ్రెస్ పార్టీ వర్గాలు, కులాలు తమకు అనుకూలంగా ఉండేలా చేసుకుంది. ఫలితంగా నియోజకవర్గాల రూపురేఖలు ఓ పద్దతిలో లేవు. కానీ వైఎస్ రెండో సారి సీఎం అవడానికి ఉపయోగపడ్డాయి. అదే తరహాలో బీజేపీ నాయకత్వం కూడా.. నియోజకవర్గాల పునర్విభజన వల్ల మేలు జరుగుతుందని అనుకుంటే చేసి తీరుతారు. లాభం జరగడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి జరగడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది.
