రియల్ ఎస్టేట్ మార్కెట్ ఊపందుకోకపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి మధ్యతరగతి ప్రజలు వేచి చూద్దామనుకునే ధోరణిలో ఉండటమే. ఊహించనంతగా పెరిగిపోయిన ధరలతో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు. ఇల్లు కొంటే సరి పోదు.. రిజిస్ట్రేషన్ చార్జీల నుంచి తర్వాత చాలా ఖర్చులు ఉంటాయి. వీలైనంత వరకూ తగ్గించుకున్న.. భారం మాత్రం అలాగే ఉంటుంది.
రిజిస్ట్రేషన్ చార్జీలు అందరికీ ఒకవిధంగానే ఉంటున్నాయి. కోట్లు పెట్టి లగ్జరీ ఇళ్లు కొనే వారికి..రూపాయి రూపాయి పోగేసుకుని జీవిత కాల స్వప్నాన్ని నెరవేర్చుకోవాలనుకునేవారికి ఒకే పన్ను విధానం ఉంటోంది. అలా కాకుండా.. తక్కువ బడ్జెట్ ఇళ్లు కొనేవారికి స్టాంప్ డ్యూటీలో మినహాయింపు ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ నిపుణుల నుంచి వస్తోంది. కనీసం రూ. 50 లక్షల లోపు ఇళ్లను కొనుగోలు చేసే వారికి స్టాంప్ డ్యూటీలో సగానికి సగం మినహాయింపు ఇచ్చినా కొనుగోలుదారులు ముందుకు వస్తారంటున్నారు. రిజిస్ట్రేషన్లు పెరుగుతాయి కాబట్టి ప్రభుత్వానికి ఆదాయం కూడా తగ్గదని అంచనా వేస్తున్నారు.
రిజిస్ట్రేషన్ ఫీజు ఇప్పుడు మధ్యతరగతికి పెనుభారంగా మారింది. ప్రభుత్వాలు ఆదాయం కోసం భూమి విలువల్ని నిరంతరంగా పెంచుతూనే పోతున్నాయి. ఇప్పుడు మార్కెట్ రేటుకు.. రిజిస్ట్రేషన్ రేటుకు పెద్దగా పొంతన ఉండటం లేదు. అందువల్ల యాభై లక్షల విలువ చేసే ఇల్లు కొంటున్నప్పుడు రెండున్నర లక్షల వరకూ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి వస్తోంది. అదనంగా చాలా ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ మధ్యతరగతి ప్రజలను ఇళ్లు కొనకుండా వెనక్కి నెడుతున్నాయి. ఇలాంటి రాయితీల విషయంలో ప్రభుత్వాలు ఆలోచిస్తే.. రియల్ ఎస్టేట్ డిమాండ్ పెరగడానికి ఓ కారణం సిద్ధం చేసుకున్నట్లవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
