రియల్ ఎస్టేట్ కు ఎన్ని ప్లస్ పాయింట్లు వస్తున్నా గడ్డుపరిస్థితే ఎదురవుతోంది. అయినా తెలంగాణ ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయింది. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ లో ఆస్తుల రిజిస్ట్రేషన్ ధరలను 30 నుంచి 50 శాతం వరకు పెంచాలని నిర్ణయించింది. అధికారిక రిజిస్ట్రేషన్ విలువలు .. ప్రస్తుత మార్కెట్ ధరల మధ్య చాలా వ్యత్యాసం ఉందని ..దాన్ని తగ్గించడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి విలువలు పెంచాలని నిర్ణియంచారు.
హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్‌లో అంటే ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపల పరిధి మొత్తం కవర్ అవుతుంది. ఈ ప్రాంతమే స్టాంపులు , రిజిస్ట్రేషన్ శాఖకు 60 నుంచి 70 శాతం ఆదాయాన్ని అందిస్తోంది. ఈ ప్రాంతంలో భూముల ధరలు పెంచితే ప్రభుత్వానికి సంవత్సరానికి రెండున్నర వేల కోట్ల అదనపు ఆదాయం ఏడాదికి వస్తుంది.
2021లో చివరిసారిగా రిజిస్ట్రేషన్ రేట్లు సవరించారని ఆ తర్వాత కోకాపేట్, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాల్లో మార్కెట్ ధరలు గణనీయంగా పెరిగాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కోకాపేట్లో ఫ్లాట్లు చదరపు అడుగుకు 10,000కి అమ్ముడవుతుంటే, రిజిస్ట్రేషన్ విలువ 3,000గా మాత్రమే ఉందని ఈ వ్యత్యాసం కారణంగా రాష్ట్ర ఆదాయం తగ్గడంతో పాటు, కొనుగోలుదారులు , విక్రేతలు తక్కువ ధరలు చూపించి బ్లాక్ మనీ చెలామణి అవకాశం కల్పించినట్లు అవుతుందని చెబుతున్నారు.
అయితే ఈ పెంపుపై రియల్ ఎస్టేట్ డెవలపర్లు , కొనుగోలుదారులలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. రియల్ ఎస్టేట్ డిమాండ్‌ను తగ్గించవచ్చని వారి ఆందోళన. అధిక ధరల కారణంగా కొనుగోలుదారులు ఇళ్ల కొనుగోలు నుంచి వెనక్కి తగ్గవచ్చని బిల్డర్లు అంటున్నారు.