మధ్యతరగతి వర్గం బలవంతంగా లగ్జరీ ఇళ్ల వైపు వెళ్తున్న సూచనలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో ప్రీమియం , లగ్జరీ హౌసింగ్ సెగ్మెంట్ ఊహించని వేగంతో పరుగులు పెడుతోంది. అక్టోబర్ 2025లో రూ. 1 కోటి పైబడిన రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లలో ఏకంగా 73 శాతం భారీ పెరుగుదల నమోదైంది.
మొత్తం రెసిడెన్షియల్ రిజిస్ట్రేషన్లు గత ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే 5 శాతం పెరిగాయి. అయితే అసలు ఆసక్తికరమైన విషయం – ఈ రిజిస్ట్రేషన్ల మొత్తం విలువ ఏకంగా 25 శాతం జంప్ చేసింది. దీనికి ప్రధాన కారణం రూ.1 కోటి నుంచి రూ. 5 కోట్ల వరకు, అంతకంటే ఎక్కువ ధర ఉన్న ఫ్లాట్లు, విల్లాలు భారీ సంఖ్యలో అమ్ముడవడమే.
రంగారెడ్డి జిల్లాలో మొత్తం 48 శాతం రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఐటీ కారిడార్ తో పాటు ఉప్పల్, ఇబ్రహీంపట్నం వైపు కూడా కోటి కన్నా ఎక్కువ విలువ ఇళ్లు ఎక్కువగా రిజిస్టర్ అవుతున్నాయి.
మూడున్నర వేల ఎస్ఎఫ్టీ ఉండే ఇళ్ల వాటా 58 శాతం. 50 లక్షల లోపు ఫ్లాట్లు కేవలం 11% మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. గతేడాది 28% ఉండేది. హైదరాబాద్‌లో గత 18 నెలలుగా NRIలు, టాప్-లెవెల్ టెక్ ఎగ్జిక్యూటివ్స్, సీనియర్ బ్యాంకర్లు, స్టార్టప్ ఫౌండర్లు భారీగా ప్రీమియం ప్రాపర్టీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వీళ్లకు రిటర్న్స్ కంటే లైఫ్‌స్టైల్, బ్రాండ్ వాల్యూ, సెక్యూరిటీ ముఖ్యం అని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది.
