సంక్రాంతి సీజన్ ముగిసింది. మన శంకర వర ప్రసాద్ గారు, నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజు చిత్రాలు విజయ పధం వైపు దూసుకెళ్లాయి. 2026కి ఇది గొప్ప బూస్టప్. తొలి నెలలోనే మూడు మంచి విజయాలు అందుకోవడం తో టాలీవుడ్ ఊపిరి పీల్చుకొంది. ఈ స్పీడు.. ఈ జోరు ఇలానే కొనసాగాలని కోరుకొంటోంది. ఆ అవకాశాలూ పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే రాబోయే సీజన్లో మంచి సినిమాలే రాబోతున్నాయి. కాకపోతే కావల్సిందల్లా ప్లానింగే. అదే.. మన నిర్మాతల మధ్య లోపించిందేమో అనిపిస్తోంది.
ఫిబ్రవరి వదిలేస్తే.. మార్చి టాలీవుడ్ కు చాలా కీలకం. వేసవి సీజన్ అప్పటి నుంచే మొదలు కానుంది. కాకపోతే మార్చిలో రాబోతున్న సినిమాలపై ఇంకా ఓ క్లారిటీ రాలేదు. ప్లానింగ్ ప్రకారం పెద్ది, పారడైజ్ సినిమాలు రావాల్సివుంది. ఒక రోజు వ్యవధిలో ఈ సినిమాల రిలీజ్ డేట్లు ప్రకటించేశారు నిర్మాతలు. కాకపోతే.. ఇప్పుడు ఈ రెండు సినిమాలూ రావడం లేదు. దాంతో మార్చి స్లాట్ ఖాళీ అయిపోయింది. ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 27న వస్తుందని అనుకొంటున్నా అధికారిక ప్రకటన రాలేదు. ఉస్తాద్ వస్తే సరే సరి.. లేదంటే మార్చి ని వృధాగా వదిలేసినట్టే.
వచ్చే సీజన్లో కొన్ని మంచి సినిమాలు క్యూలో ఉన్నాయి. డెకాయిట్, లెనిన్, స్వయంభూ లాంటి క్రేజీ ప్రాజెక్టుల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాల విడుదల విషయంలోనూ క్లారిటీ లేదు. ఏ సినిమా వస్తుందో, ఏది ఆలస్యం అవుతుందో తెలియని పరిస్థితి. ఈ గందరగోళం వీడాలి. నిర్మాతలు తమ సినిమాల విడుదల తేదీ విషయంలో ఓ క్లారిటీ ఇవ్వాలి. దాంతో మిగిలిన సినిమాలకు వెసులుబాటు దొరుకుతుంది. గతేడాది సమ్మర్ సీజన్‌ని వృధా చేసింది టాలీవుడ్. ఈసారి అలా జరక్కూడదంటే ప్లానింగ్ ఉండాలి. లేదంటే ఆఖరి నిమిషంలో హడావుడి పెరిగిపోతుంది. మరీ ముఖ్యంగా.. పెద్ది, పారడైజ్ లాంటి పెద్ద సినిమాలు తమ రిలీజ్ డేట్లు ప్రకటించి, మిగిలిన సినిమాల టెన్షన్ తగ్గించాల్సిన అవసరం వుంది. ఈ దిశగా నిర్మాతలు ఆలోచిస్తే మంచిది.