గణతంత్ర దినోత్సవం అంటే కేవలం పండగ కాదు, అది భారత ప్రజాస్వామ్య ఆత్మగౌరవ ప్రకటన. 1950 జనవరి 26న మన దేశం తనను తాను రిపబ్లిక్ గా ప్రకటించుకుని, రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చుకుంది. స్వాతంత్ర్యం మనకు స్వేచ్ఛను ఇస్తే, రాజ్యాంగం మనకు ఆ స్వేచ్ఛను ఎలా వినియోగించుకోవాలో, బాధ్యతగా ఎలా మలచుకోవాలో దిశానిర్దేశం చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ నేడు సగర్వంగా నిలబడటానికి కారణం, దశాబ్దాలుగా ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తున్న మన అత్యున్నత గ్రంథం భారత రాజ్యాంగమే.
సామాన్యుడ్ని పాలకుడ్ని చేసే రాజ్యాంగం
మన రాజ్యాంగం యొక్క సిసలు శక్తి సామాన్యుడిని అసామాన్యుడిగా మార్చడంలో ఉంది. ఒక సాధారణ చాయ్‌వాలా దేశ ప్రధాని కాగలిగినా, కింది స్థాయి నుంచి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు లేదా రేవంత్ రెడ్డి వంటి వారు ముఖ్యమంత్రులుగా రాష్ట్రాన్ని నడిపించగలుగుతున్నారన్నా, అది రాజ్యాంగం కల్పించిన సమాన అవకాశాల ఫలితమే. ఏ కులం, ఏ మతం, ఏ నేపథ్యం అన్న దానితో సంబంధం లేకుండా, ప్రజల తీర్పు ఉంటే ఎవరైనా అత్యున్నత పీఠాన్ని అధిరోహించవచ్చని మన రాజ్యాంగం నిరూపించింది. ఈ వ్యవస్థే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష.
రాజ్యాంగానికి రాజకీయాల నుంచే పెను సవాల్లు
ఇంతటి గొప్ప రాజ్యాంగానికి నేడు రాజకీయాల నుంచే పెను సవాళ్లు ఎదురవుతున్నాయి. ఏ రాజ్యాంగం కల్పించిన అధికారాన్ని అనుభవిస్తున్నారో, అదే రాజ్యాంగాన్ని అగౌరవపరిచే విధంగా కొందరు పాలకులు వ్యవహరించడం ఆందోళనకరం. వ్యవస్థలను తమ గుప్పిట్లో ఉంచుకోవాలనే తపన, రాజ్యాంగ స్ఫూర్తిని తక్కువగా అంచనా వేయడం వంటి ధోరణులు ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. అధికారం శాశ్వతం కాదని, రాజ్యాంగబద్ధమైన విలువలే శాశ్వతమని గుర్తించనప్పుడు వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉంది. కేంద్ర, రాష్ట్రాల మధ్య వారధిగా ఉండాల్సిన వ్యవస్థలు, రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించబడుతున్నాయనే విమర్శలు రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతీస్తున్నాయి. రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్మణ రేఖను దాటి రాజకీయాలు ప్రవహించినప్పుడు, అది దేశ సమగ్రతకే ముప్పుగా మారుతుంది. ఏ వ్యవస్థ అయినా రాజ్యాంగానికి లోబడి ఉండాలే తప్ప, రాజ్యాంగం కంటే పైన ఉండకూడదనేది కాదనలేని సత్యం.
రాజ్యాంగాన్ని ఎంత బలపరిస్తే.. దేశానికి అంత బలం !
రాజ్యాంగాన్ని మనం ఎంత బలంగా గౌరవించుకుంటే, దేశ భవిష్యత్తు అంత ఉజ్వలంగా ఉంటుంది. రాజకీయ వ్యవస్థ బలపడాలన్నా, సామాన్యుడి హక్కులు కాపాడబడాలన్నా రాజ్యాంగమే పరమావధి కావాలి. చట్ట సభలు, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలు తమ పరిధులను గౌరవిస్తూ ముందుకు సాగినప్పుడే నిజమైన గణతంత్రానికి అర్థం పరమార్థం లభిస్తాయి. రాజ్యాంగ విలువల రక్షణే దేశ రక్షణ అని ప్రతి పౌరుడు, ప్రతి నాయకుడు గుర్తించినప్పుడే భారత్ విశ్వగురువుగా వర్ధిల్లుతుంది.
