రియల్ ఎస్టేట్ రంగంలో బిల్డర్ల జాప్యం లేదా మోసాల వల్ల నష్టపోయిన వినియోగదారులకు ‘రెరా’ ఒక శక్తివంతమైన ఆయుధంగా మారింది. చట్టంలోని సెక్షన్ 18 ప్రకారం, బిల్డర్ ఒప్పందం ప్రకారం నిర్ణీత సమయానికి ప్రాజెక్టును పూర్తి చేయకపోయినా లేదా స్వాధీనం చేయకపోయినా, కొనుగోలుదారుడు ప్రాజెక్ట్ నుండి తప్పుకునే హక్కును కలిగి ఉంటాడు. అటువంటప్పుడు, బిల్డర్ తాను తీసుకున్న పూర్తి మొత్తాన్ని వడ్డీతో సహా వినియోగదారునికి వెనక్కి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేసే అధికారం రెరా అథారిటీకి ఉంది.
తెలంగాణ రెరా ఇటీవలే పలు సందర్భాల్లో బిల్డర్లకు అపరాధ రుసుము విధించడమే కాకుండా, బాధితులకు నగదు వాపసు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
కేవలం ఆదేశాలు ఇవ్వడమే కాకుండా, వాటిని అమలు చేయడంలో కూడా కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఒకవేళ బిల్డర్ నిర్ణీత సమయంలో డబ్బులు వెనక్కి ఇవ్వకపోతే రికవరీ వారెంట్లు జారీ చేస్తాయి. ఈ వారెంట్లను జిల్లా కలెక్టర్లకు పంపడం ద్వారా, రెవెన్యూ రికవరీ చట్టం కింద సదరు బిల్డర్ ఆస్తులను జప్తు చేసి, వాటిని వేలం వేసి బాధితులకు నగదు చెల్లించే ప్రక్రియ జరుగుతుంది.
ఈ ప్రక్రియలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. రెరా ఆదేశించినప్పటికీ, రికవరీ వారెంట్ల అమలు జిల్లా యంత్రాంగం పై ఆధారపడి ఉంటుంది. రెవెన్యూ అధికారులు ఇతర పనుల్లో నిమగ్నమై ఉండటం వల్ల కొన్నిసార్లు ఈ రికవరీ ప్రక్రియ ఆలస్యమవుతోంది. దీనిని అధిగమించేందుకు కొన్ని రాష్ట్రాల్లో రెరా తన సొంత రికవరీ విభాగాలను ఏర్పాటు చేసుకుంటోంది. తెలంగాణ, ఏపీలోనూ రెరా అలాంటి విభాగాలు ఏర్పాటు చేసుకుని కొనుగోలుదారులకు మరింత రక్షణగా ఉండాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.


