Retro Movie Review
తెలుగు360 రేటింగ్: 2/5
‘న్యూ ఏజ్ సినిమా’ అంటూ ఈతరం ప్రేక్షకులకు నచ్చే అంశాల్ని మేళవించి, పాత కథల్నే కొత్త పేట్రన్‌లో చెబుతుంటారు కొంతమంది దర్శకులు. అలాంటి వాళ్లలో కార్తీక్ సుబ్బరాజు ఒకడు. ‘పిజ్జా’ చూశాక తనకూ, తన సినిమాలకూ ఫ్యాన్స్ పెరిగిపోయారు. ‘జిగర్తాండ’తో పెద్ద హీరోలూ కార్తీక్ సుబ్బరాజ్‌ని నమ్మడం మొదలెట్టారు. ఈరోజుల్లో సూర్య లాంటి ఓ స్టార్… ఓ దర్శకుడికి అవకాశం ఇచ్చాడంటే – పైగా తన బ్యానర్లోనే సినిమా చేశాడంటే కచ్చితంగా ఆ సినిమాపై కొన్ని అంచనాలు ఉంటాయి. పైగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకుడంటే అవి మరింత పెరుగుతాయి. ‘రెట్రో’ సినిమాకీ అదే జరిగింది. సూర్య కి ఈమధ్య డిజాస్టర్ల మీద డిజాస్టర్లు తగులుతున్నాయి. దానికి తోడు `కంగువా` తన కెరీర్‌కి చాలా పెద్ద డామేజ్. అయినా సరే.. ‘రెట్రో’పై నమ్మకాలు పెంచుకొన్నారు ఫ్యాన్స్. దానికి కారణం కార్తీక్ సుబ్బరాజ్. మరి… ఆ నమ్మకాన్ని తను నిలబెట్టుకొన్నాడా, లేదా? ‘రెట్రో’లో ఏముంది?
పారి (సూర్య) తిలక్ అనే గ్యాంగ్ స్టర్ (జోజు జార్జ్) దగ్గర పెరుగుతాడు. పారి గతం ఓ చేదు జ్ఞాపకం. నవ్వడం అంటే ఏమిటో తెలియకుండా పెరుగుతాడు. తిలక్ ముందు నుంచీ పారిని కొడుకులా చూడడు. కేవలం తన అవసరాల కోసం వాడుకొంటాడు. పారి కూడా తిలక్ లా గ్యాంగ్ స్టర్ లా మారతాడు. కానీ రుక్మిణి (పూజా హెగ్డే) కోసం.. గొడవలు, ఈ దందా అన్నీ వదిలేసి మామూలు జీవితాన్ని గడపాలని ఆశ పడతాడు. తిలక్ చెప్పిన చివరి డీల్ ‘గోల్డ్ ఫిష్’ ని మిస్ ఫైర్ చేస్తాడు పారి. వందల కోట్ల విలువ గల డీల్ అది. దాని చుట్టూ ఓ రహస్యమే ఉంది. ఆ గోల్డ్ ఫిష్ ఎక్కడుందో చెప్పమని పారిని తిలక్ బతిమాలతాడు.. భయపెడతాడు. కానీ పారి మాత్రం లొంగడు. మరి ఆ గోల్డ్ ఫిష్ కథేమిటి? అసలు పారి గతం ఏమిటి? పారికీ అండమాన్ దీవుల్లో ఉంటున్న ఓ అణగారిన జాతికి ఉన్న సంబంధం ఏమిటి? అనేది మిగిలిన కథ.
ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడం గగనం అయిపోతోందని దర్శకులు, హీరోలు, నిర్మాతలూ తెగ కంగారు పడుతున్న రోజులు ఇవి. నిజమే.. ప్రేక్షకులకు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం ఈ రోజుల్లో అనుకొన్నంత సులభం కాదు. తెరపై ఏదో ఓ మ్యాజిక్ చేయాలి. హై మూమెంట్స్ ఇవ్వాలి. థ్రిల్స్.. ట్విస్ట్స్.. అన్నీ కావాలి. పైగా కొంచెం కాదు. అది కూడా లార్జ్ స్కేల్ లో ఉండాలి. అవన్నీ ఉంటే తప్ప ఆడియన్స్ ని మెస్మరైజ్ చేయడం కుదరదు. చిన్న చిన్న కాన్సెప్టులు వర్కవుట్ కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం నమ్మి, ఏం చూసి `రెట్రో` అనే కథని సూర్య ఓకే చేశాడో అర్థం కాదు. సినిమా చాలా స్లో ఫేజ్ లో మొదలవుతుంది. కథ.. ముందుకు కదలనే కదలదు. ‘ఏదో జరుగుతుందిలే.. కార్తీక్ ఏదో మ్యాజిక్ చేస్తాడులే.. ఏదో ట్విస్ట్ వస్తుందిలే’ అని ఎదురు చూడడం మినహాయించి.. పెద్ద కదలిక ఏం ఉండదు. ‘ఇది వరకు చూడని అద్భుతాలు, సంఘటనలు చూడబోతున్నారు’ అని సూర్య చెప్పడం, దాన్నీ డీటీఎస్ సౌండ్ లో వినిపించడం తప్ప.. అలాంటి అద్భుతాలు, సంఘటనలు మచ్చకైనా కనిపించవు.
ఈ సినిమాని ప్రేమ, యుద్ధం, హాస్యం, ఆ ఒక్కడు అంటూ రకరకాల చాప్టర్లుగా విడగొట్టాడు దర్శకుడు. ఏ ఒక్క చాప్టర్ మనసుని హత్తుకోదు. ‘భలే తీశాడ్రా’ అనిపించదు. ‘హాస్యం’ అనే ఓ చాప్టర్ ఉంది. దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఒళ్లంతా హాస్యనాడులున్నా కూడా.. ఒక్క క్షణం కూడా నవ్వు రాదు. జయరామ్ అనే క్యారెక్టర్ని ఇంత పేలవంగా చూపించిన సినిమా ఇది వరకు రాలేదు. త్వరలో రాబోదు కూడా. అంత నమ్మకంగా చెప్పొచ్చు. స్మైల్ డాక్టర్ ఏమిటో.. సెకండాఫ్‌లో వచ్చే ఆ కల్ట్ ఏమిటో.. దర్శకుడు ఇష్టం వచ్చినట్టు ఈ సినిమాని తీసుకొంటూ వెళ్లాడు. ఈ సినిమాపై ‘స్క్విడ్ గేమ్’ ప్రభావం ఉంది. సెకండాఫ్ డిజైన్ చేసిందే ఈ ఆట చుట్టూ. సినిమా మొత్తంలో సూర్య నాలుగైదు గెటప్పుల్లో కనిపిస్తాడు. ఒక్క చోట కూడా సూర్యని కొత్తగా చూసిన ఫీలింగ్ రాలేదు. ఆ గోల్డ్ ఫిష్ ట్విస్టేదో అదిరిపోతుంది, ఆ ట్విస్టుతో సినిమా గతే మారిపోతుందని కార్తీక్ సుబ్బరాజ్ ఫ్యాన్స్ భావించి ఉండొచ్చు. కానీ దాన్ని మరింత చప్పగా ముగించాడు దర్శకుడు. ఓ ఊరు, దానికో సమస్య, అది తీర్చడానికి హీరో రావడం.. ఎంత కాలం భరించాలి ఇలాంటి ఫార్ములా డ్రామాలు? గ్యాంగ్ స్టర్ సినిమాలా మొదలెట్టి, తరవాత ప్రేమ కథ రంగు పులిమి, ఓ ఊరి సమస్యగా మార్చి.. చివరికి దేనికీ న్యాయం చేయకుండా మిగిలిపోయిన సినిమా ఇది. సూర్య కెరీర్‌కి మరో దెబ్బ. కార్తీక్ పరాజయాలకు మరో తోడు.
సూర్యకి గెటప్పులపై మోజు తగ్గాల్సిన అవసరం ఉంది. తననుంచి అభిమానులు ఏం కోరుకొంటున్నారో తెలుసుకోవాలి. యాక్షన్ ఇమేజ్‌ని సైతం సూర్య సరిగా వాడుకోవడం లేదు. తన కథల ఎంపిక తీరుని ఒక్కసారి సరి చూసుకొంటే మేలు అనిపిస్తోంది. పూజా హెగ్డేని డీ గ్రామర్ రోల్ లో చూడడం కాస్త కొత్తగా అనిపిస్తుంది. అయితే ఓ చోట మాత్రం ఫుల్ మేకప్ తో మెరిసిపోతుంది. ఈ ఛేంజ్ ఓవర్ ఏమిటో అర్థం కాదు. పూజా.. ఏడిస్తే ఫ్యాన్స్ సైతం భరించలేరు. అలాంటి మూమెంట్స్ కూడా ఉన్నాయి. జోజు జార్జ్‌కి మరోసారి ఫుల్ లెంగ్త్ పాత్ర పడింది. తన విలనిజం కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు. జయరామ్ తో ఫన్ పండించాలని చూడడం వేస్ట్ ఎటెమ్ట్ గా మిగిలిపోయింది. తనకు ఇచ్చిన శ్రీకాకుళం యాస అస్సలు అతకలేదు.
కెమెరా వర్క్ డీసెంట్ గా ఉంది. పెళ్లి నేపథ్యంలో సాగే దాదాపు 15 నిమిషాల సీన్.. సింగిల్ టేక్ ఎఫెక్ట్‌తో చిత్రీకరించారు. అది సింగిల్ టేక్ అనే విషయం గమనిస్తే కానీ అర్థం కాదు. జైల్ నేపథ్యంలో వచ్చే పాట మినహా ఏదీ ఆకట్టుకోదు. నేపథ్య సంగీతంలోనూ దమ్ము లేదు. అండమాన్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు బాగున్నాయి. యాక్షన్ సీన్స్ కోసం కష్టపడ్డారు. కానీ ఎమోషన్ లేని యాక్షన్ ఎప్పటికీ రక్తి కట్టదు. కార్తీక్ సుబ్బరాజ్ ఈసారి బాగా నిరాశ పరిచాడు. తనని న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్ గా చూసి, ఇష్టపడేవాళ్లు సైతం తన నుంచి వచ్చిన ఈ ఎఫెక్ట్ కి ఏమాత్రం మెచ్చుకోలేరు. కార్తీక్ సుబ్బరాజ్ సినిమా అంటే ట్విస్టులు, టర్నులూ అనుకొనేవాళ్లు, సూర్య సినిమా కెళ్తే ఏదో ఓ కొత్తదనం కనిపిస్తుందని ఆశ పడేవాళ్లు ఈ సినిమాకు దూరంగా ఉండడమే మంచిది.
తన ప్రతీ సినిమాకీ ఏదో ఓ క్యాప్షన్ పెడుతుంటాడు కార్తీక్ సుబ్బరాజ్. టైటిల్ కంటే, ఆ క్యాప్షనే ఎక్కువ ఎట్రాక్ట్ చేస్తుంది.’రెట్రో’`కి తాను పెట్టిన క్యాప్షన్. ‘ఏ కార్తీక్ సుబ్బరాజ్ పాదం’ అని. ఆ పాదం కాస్త గట్టిగా పడింది. కాకపోతే.. అది ప్రేక్షకుల మీద.
తెలుగు360 రేటింగ్: 2/5