తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉప్పు, నిప్పుగా ఉంటూ వచ్చిన రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి కలిసిపోయారు. అనూహ్యంగా ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసానికి రేవంత్ రెడ్డి వెళ్లారు. కోమటిరెడ్డి కూడా రేవంత్ ను సాదరంగా ఆహ్వానించారు. రాజకీయాలు మాట్లాడుకున్నారు. తర్వాత వచ్చి మీడియాతో మాట్లాడారు. కలసి కట్టుగా తాము కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని ప్రకటించారు. పనిలో పనిగా కేసీఆర్‌పై పోరాటానికి ఏం చేయబోతున్నామో కొన్ని ప్రణాళికలు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పోస్ట్ ప్రకటించిన తర్వాత కోమటిరెడ్డి తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. పదవి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సీనియర్ నేతలందరితోనూ సమావేశమయ్యేందుకు వారి ఇళ్లకే వెళ్లారు. అలాగే కోమటిరెడ్డి ఇంటికి వెళ్లాలని ప్రయత్నించారు., పలుమార్లు సంప్రదించారు.కానీ కోమటిరెడ్డి మాత్రం రేవంత్ రెడ్డి తన ఇంటికి రావడం తనకు ఇష్టం లేదని మొహం మీదనే చెప్పారు. తన ఇంటికి ఎవరూ రావాల్సిన అవసరం లేదన్నారు. అప్పట్నుంచి రేవంత్ రెడ్డిపై పలు సందర్భాల్లో విమర్శలు చేస్తున్నారు. తన నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ప్రాంతంలో దళిత, గిరిజన దంోరా నిర్వహించడానికి కూడా అంగీకరంచలేదు.
అయితే ఇటీవల వారు మళ్లీ కలసి మాట్లాడుకోవడం ప్రారంభించారు. రాహుల్ గాంధీతో ఓ సమావేశంలో కలసి పాల్గొన్నారు. ఇప్పుడు వారి మధ్య సఖ్యత ఏర్పడినట్లుగా కనిపిస్తోంది. మూడు రోజుల కిందట కేసీఆర్ యాదాద్రి జిల్లాలో పర్యటించినప్పుడు కోమటిరెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌తో ఆయన కాస్త చనువుగా ఉండటం చర్చనీయాంశమయింది. అయితే కోమటిరెడ్డి రాజకీయం వేరుగా ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డితో రాజీపడిపోవడంతో టీ కాంగ్రెస్‌లో అసంతృప్త స్వరాలు కాస్త తగ్గే అవకాశం కనిపిస్తోంది.