సమ్మెకు వెళ్లాలని అనుకుంటున్న ఆర్టీసీ కార్మికుల మనసు మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి వినూత్నంగా ప్రయత్నించారు. హైదరాబాద్లో జరిగిన మేడే కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేసీఆర్ చేసిన అప్పుల గురించి చెప్పారు. తర్వాత ఆర్టీసీ కార్మికలు చేయాలనుకుంటున్న సమ్మె గురించి మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె ఆలోచన వీడాలన్నారు. ఇది మీ సంస్థ…. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆర్టీసీ కార్మికులపైనే ఉందని స్పష్టం చేశారు.
ఆర్టీసీ ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోంది .. వచ్చే ఆదాయమంతా మీ చేతిలో పెడతాం.. ఎలా ఖర్చు చేద్దామో మీరే సూచన చేయండని కార్మికులకు సలహా ఇచ్చారు. అణా పైసా కూడా నేను ఇంటికి తీసుకెళ్లేది లేదు.. మీ కోసమే ఖర్చు చేస్తామన్నారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతోందని అన్నారు. పలు రకాల డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చారు. 2023లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేస్తున్నట్లు గెజిట్ ముద్రించింది. 17 నెలలు గడుస్తున్నా ఉద్యోగుల విలీనం జరగలేదని ఆర్టీసీ కార్మికులు అంటున్నారు.
ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినా చేయలేదన్నారు. అలాగే 2017 వేతన సవరణ జరిపినా ఉద్యోగులకు రావలసిన బకాయిలు నేటికీ చెల్లించలేదని, వేతన సవరణ పాక్షికంగానే జరిగిందని, కొత్త అలవెన్సులు అమలులోకి రాలేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఫేమ్ పథకం ద్వారా ఆర్టీసీలకు ఎలక్ట్రిక్ బస్సులను అద్దె బస్సులుగా సరఫరా చేస్తోందని దీనివల్ల ఆర్టీసీ ఉనికికి ప్రమాదం ఏర్పడిందని చెబుతున్నరాు. అలాగే మహాలక్ష్మి పథకంలో జరుగుతున్న చిన్న చిన్న తప్పిదాలకు అనేకమంది కండక్టర్లు ఉద్యోగాలు పోగొట్టుకున్నారని తెలిపారు.
2014 నుంచి నేటివరకు సుమారు 17 వేల మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారని వారి స్థానంలో కొత్తవారిని నియమించకపోవటం వలన ఇప్పుడున్న కార్మికులపై అత్యధిక పనిభారం పడుతోందని కార్మికులు అంటున్నారు . ఈ డిమాండ్ల పరిష్కారానికి వారు సమ్మెకు వెళ్లాలని అనుకుంటున్నారు. కానీ రేవంత్ మాత్రం కార్మికులే సంస్థ యజమానులని చెబుతున్నారు.