తెలంగాణ మంత్రి వర్గంలో కొత్తగా ముగ్గుర్ని తీసుకోవడంతో శాఖల పునర్ వ్యవస్థకీరణ చేయించాలని సీనియర్ మంత్రులు చేసిన ప్రయత్నాలను రేవంత్ విఫలం చేసినట్లుగా తెలుస్తోంది. రేవంత్ వద్ద హోం, మున్సిపల్, విద్య వంటి కీలకమైన శాఖలు ఉన్నాయి. వాటిని తమకు కేటాయించాలని పలువురు సీనియర్ మంత్రులు హకమాండ్ వద్ద లాబీయింగ్ చేశారు. ముఖ్యంగా హోం శాఖ కోసం చాలా గట్టిగానే ప్రయత్నాలు చేశారు కానీ.. రేవంత్ రెడ్డి వాటన్నింటినీ నిష్ఫలం చేశారని తెలుస్తోంది.
ముగ్గురు మంత్రులతో ఆదివారం ప్రమాణం చేయించిన తర్వాత ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి శాఖల విషయంపై సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ క్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. భట్టి విక్రమార్క కూడా రెడీ అయ్యారు కానీ.. ఢిల్లీ నుంచి స్టాప్ సిగ్నల్ రావడంతో ఆగిపోయారు. మంత్రుల శాఖల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని.. రేవంత్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడి స్పష్టం చేశారు. కొత్త మంత్రులకు తన వద్ద ఉన్న శాఖలో ఇస్తానన్నారు. రేవంత్ వద్ద పదకొండు శాఖలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని కొత్త మంత్రులకు ఇస్తారు. పాత మంత్రులకు అవే శాఖలు కొనసాగుతాయి.
ప్రభుత్వంలో.. పవర్ లో నెంబర్ టు గా మారాలంటే.. హోంశాఖ ఉండాలి. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రులుగా ప్రమాణం చేసినప్పుడు ఆ శాఖలు కేటాయిస్తారని అనుకున్నారు. కానీ రేవంత్ అధికారం పరంగా మరో పవర్ సెంటర్ లేకుండా చూసుకున్నారు. ఇప్పుడు అదే వ్యూహాన్ని పాటిస్తున్నారు. హోంశాఖ ఇవ్వాల్సి వస్తే.. తన కనుసన్నల్లో ఉండేవారికి ఇస్తారు లేకపోతే.. మిగతా పదవులు పంచే అవకాశం ఉంది.