తెలంగాణలో సంచలనం సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు రుణాల చెల్లింపులపై తాజాగా విస్తుపోయే గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. గత ఆరేళ్ల కాలంలో ఈ ప్రాజెక్టు కోసం తీసుకున్న అప్పుల్లో మొత్తం 72,766 కోట్ల రూపాయలు ప్రభుత్వం తిరిగి చెల్లించింది. ఇందులో గత ప్రభుత్వ హయాం కంటే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రికార్డు స్థాయిలో చెల్లింపులు జరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ మొత్తంలో నిధులను కేటాయించి రుణ భారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోంది. ఓ ఆర్టీఐ కార్యకర్త అడిగిన మేరకు ఈ సమాచారాన్ని ప్రభుత్వ వర్గాలు ఇచ్చాయి.
ముఖ్యంగా 2025 సంవత్సరంలోనే ప్రభుత్వం ఏకంగా రూ. 33,574 కోట్లు తిరిగి చెల్లించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువ కావడమే కాకుండా, 2020 నుంచి ఇప్పటివరకు జరిగిన వార్షిక చెల్లింపుల్లోనే అత్యధికం. ప్రాజెక్టు నిర్వహణ , రుణాల భారం రాష్ట్ర ఖజానాపై పడకుండా ఉండేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోంది. వడ్డీల భారం పెరగకుండా ముందస్తుగా ఈ స్థాయిలో నిధులు విడుదల చేస్తున్నారు.
వడ్డీల రూపంలోనే ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోంది. కేవలం 2026 సంవత్సరం మొదటి నెలలోనే 417 కోట్లు కేవలం వడ్డీల కోసమే చెల్లించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న భారీ రుణాల వల్ల ప్రతి నెల వందల కోట్ల రూపాయలు కేవలం వడ్డీలకే పోతుండటం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతోంది. ఈ అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు ప్రభుత్వం కఠినమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటోంది.