విదేశీ నగరాల గురించి ఇంకెంత కాలం మాట్లాడుకుంటాం.. మనమే ఆ స్థాయి నగరాలను నిర్మించుకోవాలని ఫ్యూచర్ సిటీ అధారిటీ కార్యాలయం శంకుస్థాపనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాశమంత ఆత్మవిశ్వాసం చూపించారు. ఈ క్రమంలో ఆయన న్యూయార్క్ నే టార్గెట్‌గా పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి అన్ని వనరులు ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి .. ఆయన సమర్థంగా ప్రయత్నిస్తే న్యూయార్క్ అంత స్థాయి కాకపోయినా.. వరల్డ్ క్లాస్ సిటీగా మార్చడానికి అవకాశం ఉంది. హైదరాబాద్ ప్రపంచంలోనే టెక్ రంగంలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు పొందిన నగరం. ఆ పునాదులతో ప్రయత్నిస్తే ఫలితాలను సాధించడానికి అవకాశం ఉంటుంది.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంతా ఇప్పుడు పూర్తిగా వెస్ట్‌లో పరిమితమయింది. దానికి కారణం ఐటీ రంగం అంతా అక్కడే ఉండటం. ఇతర చోట్ల టీసీఎస్, ఇన్ఫోసిస్ భారీ క్యాంపస్‌లు పెట్టినప్పటికీ అటు వైపు అనుకున్నంతగా అభివృద్ది చెందడం లేదు. కానీ ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి భవిష్యత్ టెక్ కేంద్రంగా మార్చగలిగే అవకాశం ఉంది. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు, వరల్డ్ ట్రేడ్ సెంటర్ వంటి నిర్మాణాలను రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీలో ప్లాన్ చేశారు. దాదాపుగా ముప్ఫై వేల ఎకరాల్లో ఆయన ఫ్యూచర్ సిటీని ప్లాన్ చేస్తున్నారంటే.. అంతకు మించి గొప్ప ప్రణాళికలు ఉన్నాయని అనుకోవచ్చు.
ఓ సిటీ నిర్మాణం అంటే ఆషామాషీగా జరగదు. ప్రభుత్వం అన్నీ చేయదు. ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సంస్థలు వచ్చి పెట్టుబడులు పెట్టేలా ఉండాలి. సైబరాబాద్ ఇవాళ గ్రోజ్ ఇంజిన్ గా మారిందంటే దానికి కారణం ప్రభుత్వం ఫెసిలిటేటర్ గా మాత్రమే ఉంది. అక్కడ అంతా పెట్టుబడులు ప్రైవేటు వారు పెట్టడం ద్వారానే అభివృద్ధి చెందింది. ఫ్యూచర్ సిటీ కూడా అలాగే అభివద్ధి చెందితే.. నాలుగు నగరాలు కలిపి..దేశంలోనే హైదరాబాద్ ఓ మహానగరంగా మారుతుంది. అప్పుడు దేశంలోనే అత్యంత ఖరీదైన నగరంగా మారుతుంది. రేవంత్ రెడ్డి కల పూర్తిగా కాకపోయినా.. ఆ దిశగా అడుగు ముందుకు వేసినట్లు అవుతుంది.