కేటీఆర్ సీఎం అనే ప్ర‌చారం మీద రేవంత్ రెడ్డి కొత్త కోణం!

మంత్రి కేటీఆర్ త్వ‌ర‌లో ముఖ్య‌మంత్రి అవుతారంటూ ఈ మ‌ధ్య వ‌రుస‌గా కొంత‌మంది తెరాస మంత్రులూ నేత‌లూ అభిప్రాయ‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై కొత్త పంథాలో విశ్లేష‌ణ చేశారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. దీన్ని చూడాల్సిన కోణం వేరేగా ఉందంటూ ఓ కొత్త చ‌ర్చ‌ను తెర మీదికి తెచ్చారు. ఆయ‌నేమ‌న్నారంటే… కొంత‌కాలం మామా అల్లుళ్ల మ‌ధ్య పంచాయితీ ఉంద‌నీ, మామ‌కి అల్లుడు వెన్నుపోటు పొడుస్తాడ‌ని చ‌ర్చ న‌డించింద‌న్నారు. కొంత‌కాలం బావ, బావ‌ మ‌రుదుల మ‌ధ్య పంచాయితీ ఉంద‌న్నార‌నీ, ఇప్పుడు తండ్రీ కొడుకుల మ‌ధ్య పంచాయితీ ఉంద‌న్న‌ట్టుగా మాట్లాడుతున్నార‌న్నారు. కేసీఆర్ ని దించేసి, కేటీఆర్ ని ముఖ్య‌మంత్రి చేయాల‌ని కొంత‌మంది మంత్రులు ఇవాళ్ల మాట్లాడుతున్నార‌ని రేవంత్ అన్నారు.

మంత్రి వ‌ర్గంలో స్ప‌ష్ట‌మైన చీలిక వ‌చ్చిన‌ట్టుగా దీన్ని చూడాల‌న్నారు! కేసీఆర్ ని ఉన్న‌ప‌ళంగా దించేసి, కేటీఆర్ ని సీఎం చేయాల‌ని ఎర్ర‌బెల్లి ద‌యాక‌రావు అంటున్నారంటే… కేసీఆర్ నాయ‌క‌త్వం మీద న‌మ్మ‌కం స‌న్న‌గిల్లినట్టే క‌దా అన్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితిని మూడు ర‌కాలుగా చూడాల‌నీ, పార్టీలో ఏం జ‌రుగుతోంద‌న్న‌ది ఒక‌ట‌నీ, ప్ర‌భుత్వంలో ఏం జ‌రుగుతోంద‌నేది రెండోద‌నీ, మంత్రివ‌ర్గంలో ఏం జ‌రుగుతోంద‌నేది మూడోద‌న్నారు. మంత్రులు శ్రీ‌నివాస్ గౌడ్, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర ‌రావు, ఎంపీ క‌విత… వీళ్లు కేసీఆర్ నాయ‌క‌త్వం వ‌ద్దు అని చెబుతున్నార‌ని రేవంత్ విశ్లేషించారు. తెరాసలో భారీ చీల‌క వ‌చ్చింద‌ని అర్థం చేసుకోవాల‌న్నారు. కేసీఆర్ కి అల్లుడు ముప్పు త‌గ్గిందిగానీ, కొడుకే ప్ర‌త్యామ్న‌యంగా పోటీగా త‌యారౌతున్నాడ‌న్నారు. కేటీఆర్ కి ముఖ్య‌మంత్రి ప‌ద‌వి మీద వ్యామోహం వ‌స్తే ఏదైనా జ‌ర‌గొచ్చ‌న్నారు. త‌రువాత ఎవ‌రు బాధ్య‌త వ‌హిస్తార‌ని రేవంత్ వ్యాఖ్యానించారు.

కేటీఆర్ కాబోయే సీఎం అంటూ కొంద‌రు తెరాస నేత‌ల అభిప్రాయాన్ని… ఆ పార్టీలో వ‌చ్చిన చీలిక‌గా, కేసీఆర్ నాయ‌క‌త్వంపై వ్య‌క్త‌మౌతున్న అప‌న‌మ్మ‌కంగా చిత్రించే ప్ర‌యత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఈ కోణంలో ఇంత‌వ‌ర‌కూ ఎవ్వ‌రూ విమ‌ర్శించ‌లేదు. అయితే, రేవంత్ అభిప్రాయంలో ఊహాజనిత ప‌రిస్థితులే ఎక్కువ క‌నిపిస్తోంది. కేసీఆర్, కేటీఆర్ మ‌ధ్య కోల్డ్ వార్ అనేది లేదు క‌దా! మంత్రులూ నేత‌లు కూడా కేసీఆర్ మీద గుర్రుగా ఉండ‌టం లాంటివీ ప్ర‌స్తుతం లేవు. సీఎం ప‌ద‌వి కోసం కేటీఆర్ వెంప‌ర్లాడుతున్న తీరూ ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. మ‌రో నాలుగేళ్ల నాటికి పార్టీకి త‌న వార‌సుడిని నాయ‌కుడిగా నిలిపే ప్ర‌య‌త్నం కేసీఆర్ ఎప్పుడో మొద‌లుపెట్టారు. అది కొత్త‌దేం కాదు, అనూహ్య‌మైంది అంత‌క‌న్నా కాదు. రేవంత్ విశ్లేష‌ణ విన‌డానికి ఆస‌క్తిక‌రంగా ఉన్నా… వాస్త‌విక‌త లోపించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com