హైదరాబాద్ బతుకమ్మకుంటలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో సీఎం రేవంత్ పాల్గొన్నారు. కబ్జా అయిన చెరువును సంరక్షించి.. బతుకమ్మకుంటగా హైడ్రా మార్చింది. అక్కడ బతుకమ్మ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రేవంత్ హాజరయ్యారు. ప్రసంగంలో ఆయన నాగార్జున ప్రస్తావన తీసుకు వచ్చారు. తుమ్మడికుంట కబ్జా చేసి నాగార్జున తెలిసో తెలియకో ఎన్ కన్వెన్షన్ నిర్మించారని అన్నారు. అధికారులు కబ్జాను గుర్తించి సహకరించాలని అడిగితే ఆయన స్పందించలేదన్నారు.
బీఆర్ఎస్ నేతలతో ఉన్న సాన్నిహిత్యం వల్ల నాగార్జున ముందుకు రాలేదని రేవంత్ పరోక్షంగా చెప్పారు. మా అధికారులు వెళ్లి ఎన్ కన్వెన్షన్ ను తొలగించారు. ఆ తర్వాత తప్పు తెలుసుకుని..తాను ఆదర్శంగా ఉంటానని చెప్పి నాగార్జున రెండు ఎకరాలను ప్రభుత్వనికి అప్పగించారని తెలిపారు. చెరువుల సంరక్షించేందుకు తన వంతుగా సహకరిస్తానని హామీ ఇచ్చారన్నారు.
చెరువును పునరుద్ధరణ సందర్భం కాబట్టి రేవంత్ నాగార్జున పేరును ప్రస్తావించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాక ముందు ఎన్ కన్వెన్షన్ ప్రధానమైన లగ్జరీ ఈవెంట్ లకు కేంద్రంగా ఉండేది. ఓ వైపు చెరువు నీళ్లకు అడ్డంగా కట్టినట్లుగా ఉంటుంది. దాన్ని తొలగించారు. మొత్తం వివాదం లేకుండా ఉండాలంటే… చెరువు స్థలాన్ని ప్రభుత్వానికి ఇచ్చేస్తే మంచిదని నాగార్జున డిసైడ్ చేసుకున్నారు. లేకపోతే అది ఎప్పటికీ ఓ వివాదంలా ఉండిపోయేది. కానీ సందర్భం వచ్చినప్పుడల్లా.. ఈ ప్రస్తావన రేవంత్ తీసకురావడం నాగార్జునకు ఇబ్బందికరంగానే ఉంటుంది.