ఏపీలో రాజకీయ నాయకత్వం గురించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓ జాతీయ మీడియాలో చేసిన ఇంటర్యూల్లో నారా లోకేష్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతున్నాయి. తనతో పోటీపడే విషయంలో నారా లోకేష్ టూ యంగ్ అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు చాలా సీనియర్ అని కూడా ధైర్యం చెప్పుకున్నారు. కానీ రాజకీయాలు చేయడానికి వయసుతో పని ఉండదని మాత్రం రేవంత్ అర్థం చేసుకోలేకపోయారు. ఎందుకంటే ఇప్పుడు కాలం మారిపోయింది. వయసుతో పని లేదు. ఏ రంగంలో అయినా కుర్రాళ్లే రథ సారథులవుతున్నారు.
మేనేజర్‌గా రిటైరయ్యే కాలం కాదిది!
రేవంత్ రెడ్డి జమానాలో అయితే ఒకరు ఓ ఉద్యోగంలో చేరి.. మెల్లగా అనుభవం మీద ఒక్కో మెట్టు ఎక్కుతూ.. రిటైర్మెంట్ కు ముందు మేనేజర్ పోస్టుకు చేరడమే ప్రాసెస్. ఇప్పుడు కూడా అదే మైండ్ సెట్ లో రేవంత్ రెడ్డి ఉన్నారు. కానీ ఇప్పుడు కాలం ఏఐ కాలం వచ్చింది. దేశాలను కూడా ముప్ఫై, నలభై ఏళ్ల లోపు యువతీయువకులు నడిపిస్తున్నారు. కంపెనీలకూ వారే సారధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు సీనియారిటీ కాదు.. నాయకత్వ సామర్థ్యం.. టాలెంట్ మాత్రమే కీలకం. రాజకీయాల్లోనూ అదే ట్రెండ్ కనిపిస్తోంది.
నారా లోకేష్ ను పోటీగా చూశారు.. అదే మార్పు !
నారా లోకేష్ రాజకీయ నాయకత్వం విషయంలో టూ యంగ్ అని అనడానికి రేవంత్ తనతోనే పోలిక చేసుకున్నారు. ఇక్కడే నారా లోకేష్ అసలు రాజకీయాల్లో ఎంత సాధించారో క్లారిటీ వస్తుంది. రేవంత్ రెడ్డి ఓ జాతీయ పార్టీ సీఎం. ఆయన ఆ పొజిషన్ కు రావడానికి చాలా కష్టపడ్డారు. ఈ విషయంలో ఆయన సక్సెస్ రూట్ ను తప్పుపట్టడానికి ఏమీ లేదు. ఆయనది ఇన్స్పైరింగ్ జర్నీ. అలాంటి నేత తన ప్రయాణంతో నారా లోకేష్ ను పోల్చుకున్నారు. నిజానికి నారా లోకేష్‌కు చంద్రబాబు కుమారుడు అనే ఇమేజ్ ఎంత లాభమో.. అంత కంటే ఎక్కువ నష్టం చేసింది కూడా. ఆ ఇమేజ్ నుంచి బయటపడి ఆయన ..పాదయాత్ర చేసి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. అది లోకేష్ సామర్థ్యానికి సర్టిఫికెట్. ఇప్పుడు పాలనలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. దిగ్గజ కంపెనీలు ఏపీకి క్యూ కట్టడానికి నారా లోకేషే కారణం. అటు పాలిటిక్స్.. ఇటు అడ్మినిస్ట్రేషన్ లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు.
పోటీపడాల్సి వస్తే రేవంత్‌కు వయసు అడ్వాంటేజ్ కాదు!
నిజంగా రేపటి రోజున రేవంత్ రెడ్డితో నారా లోకేష్ రాజకీయంగా లేదా.. పాలనా పరంగా పోటీ పడాల్సి వస్తే.. కచ్చితంగా రేవంత్ రెడ్డికి వయసు అడ్వాంటేజ్ కాదు. లోకేష్ కన్నా తాను పెద్దవాడినని చెప్పుకోవడం ద్వారా ఆయనకు ఎలాంటి ఉపయోగాలు లభించవు. నేటి కాలంలో అంతా యువత ఆలోచనలకే పెద్ద పీట వేస్తున్నారు. ఏఐ కాలంలో వారి నిర్ణయాలు కూడా అలాగే ఉంటున్నాయి. అందుకే బడా బడా కంపెనీలు తమ సారథ్యాల్లో అనుభవం కన్నా సామర్థ్యాన్ని చూస్తున్నాయి. నారా లోకేష్ అలాంటి నాయశతాబ్దాపు యువనాయకుడు. ఆయనను వయసు, అనుభవం పేరుతో వెనక్కి నెట్టేయలేరు.