హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత ఫ్యూచర్ సిటీ పేరుతో నాలుగో సిటీ నిర్మించాలని తెలంగాణ సీఎం రేవంత్ పట్టుదలగా ఉన్నారు. రెండేళ్లు దగ్గర పడుతున్నా ఈ విషయంలో ఇంకా కీలకమైన నిర్ణయాలు పూర్తి కాలేదు. మాస్టర్ ప్లాన్ గురించీ స్పష్టత లేదు. ఇంకా భూసమీకరణ చేయాల్సి ఉంది. అయితే ఉన్న భూముల వరకూ నిర్మాణాలు ప్రారంభించాలని అనుకుంటున్నారు. అందుకే ముహుర్తం ఖరారు చేసుకున్నారు.
ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టుకు ఆదివారం శంకుస్థాపన జరగనుంది. రంగారెడ్డి జిల్లాలోని ముచెర్ల ప్రాంతంలో ఈ మెగా అభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. మొదటి దశలో 30 వేల ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం ప్రారంభమవుతుందని, ఈ దశలో 9 జోన్లు ఏర్పాటు చేస్తారని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల రాష్ట్రంగా మార్చాలనే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యం.
శ్రీశైలం, నాగార్జునసాగర్ హైవేల మధ్యలో ఈ ప్రాజెక్టు రూపొందుతుంది. మొదటి దశలో ఏర్పాటు చేసే 9 జోన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సిటీ, హెల్త్ జోన్, ఎడ్యుకేషన్ జోన్, మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్లు, గ్రీన్ ఎనర్జీ పార్క్‌లు మొదలైనవి ఉంటాయి. ఈ జోన్లు రాష్ట్రంలో లక్షలాది ఉద్యోగాలను సృష్టించి, పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిస్తాయని సీఎం నమ్మకంతో ఉన్నారు. భూసేకరణ విషయంలో రైతుల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఫార్మా సిటీ కోసం సేకరించిన భూముల్ని ఫ్యూచర్ సిటీకి వాడుతున్నారు. ఇంకా భూములు అవసరం. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుతో ఈ ప్రాజెక్టు వేగవంతమవుతుందని.. ఈ అథారిటీలో 90 పోస్టులు సృష్టించి, మాస్టర్ ప్లాన్, మెట్రో కనెక్టివిటీ, రేడియల్ రోడ్ల అభివృద్ధి వంటివి చేపడతారని అంచనా వేస్తున్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి చాలా ఆలోచనలు బయట పెట్టారు. కానీ ఏదీ కూడా పట్టాలెక్కడం లేదన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి శంకుస్థాపన చేస్తున్నారు. వెంటనే నిర్మాణాలు ప్రారంభించి గ్రోత్ చూపిస్తే నమ్మకం పెరుగుతుంది. ప్రైవేటు పెట్టుబడులు వస్తే ఇక తిరుగుండదు.