హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయికి చేర్చే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కీలక దశకు చేరుకుంది. కేవలం అందం కోసమే కాకుండా, నగర భవిష్యత్తు అవసరాలను, వరద ముప్పును దృష్టిలో ఉంచుకుని అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో దీనిని రూపొందిస్తున్నారు. సీఎం రేవంత్ మూసి ప్రక్షాళన కోసం ఒక్కో అడుగు వేస్తున్నారు. ఓ రకంగా ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్టుగా మారింది.
లక్షన్నర క్యూసెక్కుల వరద తట్టుకునేలా రిటైనింగ్ వాల్స్
ముఖ్యంగా 1.5 లక్షల క్యూసెక్కుల వరదను సైతం తట్టుకునేలా నదికి ఇరువైపులా పటిష్టమైన రక్షణ గోడలను నిర్మించడం ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన అంశం. గతంలో సంభవించిన వరదల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని, 100 ఏళ్ల వరద స్థాయిని సైతం తట్టుకునేలా డిజైన్లు సిద్ధమయ్యాయి.
ఈ ప్రాజెక్టు ద్వారా మూసీ నది స్వరూపమే పూర్తిగా మారిపోనుంది. నది వెడల్పును 108 మీటర్ల మేర సమానంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. ఈ పరిధిలోనే వరద కాలువ, పచ్చదనం, పాదచారుల మార్గాలు, సర్వీసు రోడ్లు ఉంటాయి. దీనికి అదనంగా, నగరంలోని 27 నాలాల ద్వారా వచ్చే మురుగునీరు నేరుగా నదిలో కలవకుండా ఉండేలా, నదికి ఎగువన ఇరువైపులా భారీ ట్రంక్ డ్రయినేజీలను నిర్మిస్తున్నారు. అంటే, మధ్యలో స్వచ్ఛమైన నీటితో నిండిన నది ప్రవహిస్తుంటే, దానికి సమాంతరంగా భూగర్భంలో మురుగునీటి వ్యవస్థ కొనసాగుతుంది.
భూగర్భంలో మురుగునీటి శుద్ధి ప్లాంట్లు
పర్యావరణ పరిరక్షణలో భాగంగా, ఈ డ్రయినేజీ మార్గాల్లో అక్కడక్కడా భూగర్భంలో అత్యాధునిక మురుగునీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. దక్షిణ కొరియా వంటి దేశాల్లో ఉన్న మోడల్‌ను అనుసరించి, ఈ ప్లాంట్ల పైన పార్కులు , క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేస్తారు. ఇలా శుద్ధి చేసిన నీటిని పరిశ్రమలకు, నిర్మాణ రంగానికి విక్రయించడం ద్వారా ఆదాయాన్ని కూడా పొందాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల మూసీ నది కేవలం డ్రైనేజీ కాలువలా కాకుండా, నిరంతరం నీరు ప్రవహించే జీవనదిలా కనిపిస్తుంది.
55 కిలోమీటర్ల ప్రత్యేక కారిడార్
గండిపేట నుంచి ఎక్కడా ట్రాఫిక్ సిగ్నల్స్ లేకుండా ప్రయాణించేలా ప్రత్యేక కారిడార్‌ను నిర్మిస్తున్నారు. ఇది నగర వాసుల ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గిస్తుంది. అలాగే, 55 కిలోమీటర్ల పొడవునా సాగే ఈ ప్రాజెక్టు వల్ల సుమారు రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన రియాల్టీ భూమి వినియోగంలోకి రానుంది. కొత్తగా నిర్మించబోయే 29 వంతెనలు , గాంధీ సరోవర్ వంటి పర్యాటక ఆకర్షణలు హైదరాబాద్ తూర్పు భాగంలో రియల్ ఎస్టేట్, ఆర్థిక కార్యకలాపాలను సరికొత్త స్థాయికి తీసుకెళ్తాయని అంచనా. ఎలాంటి ఆటంకాలు వచ్చినా సరే.. ఈ ప్రాజెక్టును అనుకున్న విధంగా ముందుకు తీసుకెళ్లాలని సీఎం రేవంత్ పట్టుదలతో ఉన్నారు.


