ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ నిండా మునిగిపోయారు. ఆ కేసులో స్కాం ఏమీ జరగలేదని బీఆర్ఎస్ నేతలు గగ్గోలు పెట్టవచ్చు..అదో లొట్టపీసు కేసు అని కేటీఆర్ గొంతెత్తి నినదించవచ్చు కానీ చట్టపరంగా జరగాల్సినవి జరిగి తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేటీఆర్ ముందు ఈ కేసు విషయంలో ఎలాంటి దారి లేకుండా పోయింది. అవసరం లేకపోయినా అన్ని అవకాశాలను వినియోగించుకున్న కేటీఆర్ ఇప్పుడు.. ప్రభుత్వం ఏం చేస్తే దానికి సిద్ధపడాల్సిన పరిస్థితికి వచ్చారు.
క్వాష్ పిటిషన్లతో అవకాశాలు కోల్పోయిన కేటీఆర్
కేటీఆర్ లీగల్ టీం ఏం చెప్పిందో.. కేటీఆరే సొంత నిర్ణయాలు తీసుకున్నారో కానీ.. ఫార్ములా ఈ రేసు కేసులో క్వాష్ పిటిషన్లను ఆయన ముందుకు తీసుకెళ్లారు. సుప్రీంకోర్టు వరకూ వెళ్లారు. ఎక్కడా సానుకూల నిర్ణయం రాలేదు. అంటే ఆయనపై చర్యలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్లే. ప్రభుత్వం అన్నీ చట్టపరంగా వెళ్తోంది. గవర్నర్ అనుమతులు ఎంత వరకూ అవసరమో..అంత వరకూ తీసుకుంటోంది. ఇప్పుడు అరెస్టు చేస్తే ఆ తర్వాత బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవడం తప్ప కేటీఆర్ కు మార్గం లేదు. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవడానికి కూడా సమయం దాటిపోయింది. అది రాజకీయంగానూ నష్టపరుస్తుంది.
రేవంత్ అనుకుంటే ఏ క్షణమైనా జైలుకు
ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ ఎప్పుడో ఫిక్స్ అయ్యారు. గ్రీన్ కో సబ్సిడరీ కంపెనీ నుంచి వచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ టైమింగ్.. హెచ్ఎండీఏ నిధుల నుంచి ఎఫ్ఈవోకు కట్టిన రూ.55కోట్ల నిధుల టైమింగ్ సరిపోలుతుంది. ఇవన్నీ ఏసీబీ అధికారులు ఎక్స్ పోజ్ చేశారు. అన్నింటికీ మించి ఆ నిధుల్ని అడ్డగోలుగా పంపించారు. విదేశీ మారకద్రవ్యాన్ని నేరుగా యూరప్ కు తరలించారు ఆర్బీఐ కూడా జరిమానా విధించింది. ఆ డబ్బులు తరలించడానికి అసలు ఎలాంటి అనుమతులు లేవు. అంటే అది అక్రమ చెలామణి. డబ్బులు తీసుకున్నామని ఎఫ్ఈవో చెప్పినంత మాత్రం సక్రమం కాదు. అందుకే రేవంత్ రెడ్డి కేటీఆర్ ను జైలుకు పంపాలని అనుకుంటే ఏ క్షణమైనా పంపుతారు.
రేవంత్ జాలి చూపించడం కేటీఆర్ అహంపై దెబ్బ కొట్టినట్లే !
కేసీఆర్, కేటీఆర్ పవర్ లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని ఎలా జైలుకు పంపే అవకాశం వచ్చినా వదిలి పెట్టలేదు. జన్వాడ ఫాంహౌస్ మీద డ్రోన్ ఎగురవేసినందుకు అరెస్టు చేసి టెర్రరిస్టుల్ని పెట్టే సెల్లో పెట్టారు. పలుమార్లు ఆయనను అరెస్టు చేశారు. పీసీసీ చీఫ్ పదవి ఇస్తారని ప్రచారం జరిగినప్పుడల్లా ఏదో ఓ కేసు పెట్టి అరెస్టు చేసేవారు. ఇవన్నీ రేవంత్ రెడ్డికి గుర్తుండక కాదు. కాన వారికి తనకు తేడా ఏంటో తెలియాలి కదా అన్నది రేవంత్ కాన్సెప్ట్. అరెస్టుల విషయంలో ఇప్పటి వరకూ రేవంత్ ఎలాంటి తొందరపాటు చూపించడం లేదు. ఇది కూడా.. కేటీఆర్ అహంపై దెబ్బకొట్టినట్లే అవుతుంది. ఓ రకంగా ప్రతీకారం తీర్చుకున్నట్లే అవుతుంది.


