ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన పనితీరులో స్పష్టమైన మార్పు వచ్చిందని రేవంత్ రెడ్డి స్వయంగా అంగీకరించారు. ఆవేశం స్థానంలో ఇప్పుడు బాధ్యతాయుతమైన ఆలోచన చేరిందని ఆయన పేర్కొన్నారు. మూసీ పునరుజ్జీవనం పై జరిగిన ప్రజెంటేషన్ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ ్వుతున్నాయి.
రాష్ట్ర ప్రయోజనాల కోసం తన పనితీరును మార్చుకున్నానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్ వంటి రాజకీయ ప్రత్యర్థులపై గతంలో వాడిన ఘాటు భాషకు ఇక స్వస్తి పలకనున్నట్లు ఆయన మాటలు సూచిస్తున్నాయి. విమర్శల కంటే రాష్ట్ర అభివృద్ధిపైనే తన దృష్టి ఉంటుందని, ఎవరైనా నిర్మాణాత్మకమైన సూచనలు ఇస్తే వాటిని స్వీకరించడానికి తాను ఎప్పుడూ సిద్ధమేనని ఆయన ప్రకటించారు. కేవలం రాజకీయాల కోసమే కాకుండా, రాష్ట్రానికి ఏదో ఒకటి చేసి చూపించాలన్న తపన తనలో బలంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
ముఖ్యమంత్రి పదవి అనేది ఒక వ్యక్తిగత హోదా కాదని, అది ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే గతంలోని దూకుడును తగ్గించి, పరిణతి చెందిన నాయకుడిగా వ్యవహరించాలని ఆయన నిర్ణయించుకున్నారు. మూసీ ప్రక్షాళన వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల విషయంలో అందరినీ కలుపుకుని పోవాలన్నది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది.
రేవంత్ రెడ్డిలో కనిపిస్తున్న ఈ సానుకూల మార్పు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇటీవలి కాలంలో ఆయన కేసీఆర్, కేటీఆర్ లపై ప్రయోగిస్తున్న భాష వివాదాస్పదం అవుతోంది. సీఎం స్థాయిలో ఉండి అలా మాట్లాడకూడదన్న సూచనలు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో ఆయన మారాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. రేవంత్ ఆ భాష మాట్లాడకపోతే.. బీఆర్ఎస్ నేతలు కూడా రివర్స్ లో అంతకు మించి అన్నట్లుగా మాట్లాడకుండా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు.
