ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన నేనే రాజు.. నేనే మంత్రి వ్యాఖ్యలు ఆయనకు అధికార అహంకారం పెరిగిందన్నదానికి సూచనలని కొంత మంది విమర్శలు చేస్తూండటంతో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తన మాటలను ప్రతిపక్షాలు కావాలనే వక్రీకరించాయని, ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశం బాధ్యతను స్వీకరించడమే తప్ప అహంకారం కాదని ఆయన స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను నిర్వహిస్తూనే, మున్సిపల్ పరిపాలన శాఖను కూడా తానే పర్యవేక్షిస్తున్నందున, రాబోయే ఎన్నికల ఫలితాలకు తానే పూర్తి జవాబుదారీ అని చెప్పే క్రమంలో ఆ పదాన్ని ఉపయోగించినట్లు ఆయన వివరించారు. రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ, కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని సీఎం పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా , మున్సిపల్ శాఖా మంత్రిగా రెండు బాధ్యతలు తన వద్దే ఉన్నందున, పట్టణాల్లో జరిగే అభివృద్ధికి మరియు ఎన్నికల్లో వచ్చే గెలుపోటములకు తానే బాధ్యుడినన్న ఉద్దేశంతోనే ఆ వ్యాఖ్యలు చెప్పానన్నారు.
కేవలం రాజ్యాంగబద్ధమైన పదవుల రీత్యా తాను ఆ వ్యాఖ్యలు చేశానని, దీనిని తప్పుగా చిత్రించి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని ఆయన విపక్షాలకు సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగిరిన తీరుపై హర్షం వ్యక్తం చేస్తూనే, హంగ్ ఏర్పడిన సుమారు 36 మున్సిపాలిటీల్లో పార్టీ బలాన్ని పెంచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే పట్టును కొనసాగిస్తూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
