బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డికీ తెలుసు. ఒక వేళ ఇవ్వకపోతే ఇంకా ఎక్కువ ఇబ్బంది పడేది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉన్నప్పుడు స్టే వస్తే..పార్టీ నేతలు భారీగా నష్టపోతారు. అందుకే నామినేషన్లు పడక ముందే స్టే రావడం మంచిదే అయిందని అనుకోవచ్చు. అయితే రేవంత్ ఇప్పుడు స్థానిక ఎన్నికలపై ఏ నిర్ణయం తీసుకోబోతున్నారన్నది కీలకం.
లోకల్ పోల్స్ ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యాయి. పార్టీ నేతలు కూడా పదవుల కోసం చూస్తున్నారు. కానీ బీసీ రిజర్వేషన్లు ఇచ్చే ఎన్నికలకు వెళ్తామని చేసిన ప్రకటనల వల్ల రేవంత్ ఇప్పుడు ఇదంతా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కోర్టు ఆపేసింది కనుక.. కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన జీవో ప్రకారమే .. స్థానిక ఎన్నికలకు రీ షెడ్యూల్ జారీ చేసి.. పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు ఇస్తే సరైన వ్యూహం పాటించినట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. సీఎం రేవంత్ కూడా ఈ ప్రణాళికకు ఎప్పుడో సన్నాహాలు చేసుకున్నారని అంటున్నారు.
తీర్పు అధికారిక కాపీ అందిన తర్వాత ఎస్ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేస్తుంది . అంతకు మించిన మార్గం లేదు. సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రయోజనం ఉండదు. అలా వెళ్తే లోకల్ పోల్స్ ను వాయిదా వేసుకోవడానికి పనికి వస్తుంది కానీ…సమస్య పరిష్కారం కాదు. ఇప్పుడు రిజర్వేషన్లు అధికారికంగా లేకపోయినా పార్టీ పరంగా నలభై రెండు శాతం ఇవ్వడం ద్వారా బీసీ వర్గాలను బుజ్జగించవచ్చని అనుకుంటున్నారు. ఇతర పార్టీలు ఆ పర్సంటేజీలో ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ సమస్యను ఇలా పొడిగించుకోవడం కన్నా.. రేవంత్ రెడ్డి వెంటనే పార్టీ పరమైన రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించడం ఉత్తమం అన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.