రెడ్లకి చాలా చెయ్యాల‌ని నేత‌లు.. చేశామ‌ని ప్ర‌భుత్వం..!

తెలంగాణ రాజ‌కీయాల్లో రెడ్డి సామాజిక వ‌ర్గం ఎంత కీల‌కంగా మారిందో అంద‌రికీ తెలిసిందే. ప్ర‌ధాన పార్టీల‌న్నీ ఆ సామాజిక వ‌ర్గాన్ని ఆక‌ర్షించ‌డంపైనే ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెడుతున్నాయి. ఈ నేప‌థ్యంలో రెడ్ల స‌మ‌ర‌భేరి హైద‌రాబాద్ లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌కు అధికార ప్ర‌తిప‌క్షాల‌కు చెందిన ప్ర‌ముఖ రెడ్డి సామాజిక వ‌ర్గ నాయ‌కులు హాజ‌ర‌య్యారు. రెడ్డి సామాజిక వ‌ర్గ సంక్షేమం కోసం ప్ర‌భుత్వం ఏం చేయ‌డం లేద‌న్న‌ట్టుగా కాంగ్రెస్ నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తే, ఇప్ప‌టికే చాలా చేశామంటూ అధికార పార్టీ నేత‌లు స‌మ‌ర్థించుకుంటూ వ‌చ్చారు.

ఈ స‌భ‌లో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డితే రెడ్డి సామాజిక వ‌ర్గానికి మేలు జ‌రుగుతుంద‌ని ఆశించామ‌న్నారు. కానీ, ఆశించిన‌దేదీ జ‌ర‌గ‌డం లేద‌న్నారు. విద్యా ఉద్యోగావ‌కాశాల్లో కోటా, వాటాల కోసం స‌ర్కారుతో పోరాటం చేయాల్సి వ‌స్తోంద‌న్నారు. విద్యా ఉద్యోగాల‌తోపాటు ప‌దోన్న‌తుల విష‌యంలో కూడా రెడ్డి సామాజిక వ‌ర్గానికి అన్యాయం జ‌రుగుతోంద‌ని రేవంత్ ఆరోపించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రెడ్ల స‌త్తా చూపాల‌ని ఆయ‌న అన్నారు. రిజ‌ర్వేష‌న్ల విధానంతో అగ్ర‌కుల పేద‌లు ర‌గిలిపోతున్నారంటూ డీకే అరుణ అన్నారు. ఉద్దేశపూర్వ‌కంగానే రెడ్ల జ‌నాభాను త‌క్కువ సంఖ్య‌లో ప్ర‌భుత్వం చూపుతోంద‌నీ, స‌మ‌గ్ర స‌ర్వే చేయించిన సీఎం కేసీఆర్ కు వాస్త‌వ‌ రెండ్ల సంఖ్య ఎంతో, వారు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లేంటో తెలియవా అంటూ కాంగ్రెస్ నేత‌లు విమ‌ర్శించారు. ఈ స‌భ‌లో పాల్గొన్న హోం మంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి మాట్లాడుతూ… ప్ర‌భుత్వం చాలా చేస్తోంద‌నీ, ప్ర‌తీ దానికీ ముఖ్య‌మంత్రినీ ఆయ‌న కుటుంబాన్నీ విమ‌ర్శించ‌డం త‌గ‌ద‌నీ, దాని వ‌ల్ల స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భించ‌దు అన్నారు. కార్పొరేష‌న్ ఏర్పాటుకు కృషి చేస్తామ‌న్నారు. క‌ల్యాణ ల‌క్ష్మీ ప‌థ‌కాన్ని అగ్ర‌కులాల‌కు కూడా వ‌ర్తించేలా సీఎం నిర్ణ‌యం తీసుకున్నార‌న్నారు.

ఇక‌, స‌మ‌ర‌భేరిలో కొన్ని ప్ర‌ధాన డిమాండ్ల‌ను రెడ్డి సామాజిక వ‌ర్గం తీర్మానించింది. కులా ప్రాతిప‌దికన కాకుండా, ఆర్థిక స్థితి గ‌తుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని నేత‌లు డిమాండ్ చేశారు. విదేశీ విద్యకు వెళ్లేవారి కోసం రూ. 20 ల‌క్ష‌ల సాయం అందించాల‌న్నారు. రెడ్డి సామాజిక వ‌ర్గంలో 50 ఏళ్లు దాటిన రైతుల‌కు నెల‌కు రూ. 3 వేలు పెన్ష‌న్ ఇవ్వాల‌న్నారు. అక‌స్మాతుగా మృతి చెందిన రెడ్డి సోద‌రుల కుటుంబానికి రూ. 10 ల‌క్ష‌ల ఆర్థిక సాయం అందించాల‌న్నారు. ఇలా ఓ ప‌ది డిమాండ్ల‌ను స‌మ‌ర‌భేరి తీర్మానించింది. ఈ స‌మావేశంలో అధికార ప్ర‌తిప‌క్షాల నేత‌ల మ‌ధ్య సంభాష‌ణ‌లు ఆస‌క్తిగా సాగ‌డం గ‌మ‌నార్హం. ప‌రోక్షంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటూ మంత్రి నాయిని మాట్లాడ‌టం కొంత చ‌ర్చ‌నీయాంశ‌మే అయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com