పదమూడో తేదీన ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఫుట్ బాల్ మ్యాచ్ మెస్సీ టీంతో.. రేవంత్ టీం తలపడనుంది. రేవంత్ రెడ్డి ఇందు కోసం ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ పై బీఆర్ఎస్ పార్టీ అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ప్రజాధనం వంద కోట్లు ఖర్చు పెడుతున్నారని ఆరోపణలు చేస్తోంది.స్టేడియంను నాశనం చేస్తున్నారని కూడా అంటున్నారు.
ఢిల్లీ పర్యటనలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలను ఖండించారు. మెస్సి హైదరాబాద్ లో మ్యాచ్ ఆడటానికి, ప్రభుత్వానికి ఏం సంబంధం లేదన్నారు. ఓ ప్రైవేటు సంస్థ మ్యాచ్ ఏర్పాటు చేసిందని.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తనకు ఆహ్వానం ఇచ్చిందన్నారు. తాను స్వతహాగా ఫుట్ బాల్ ప్లేయర్ ను కావడంతో ఆసక్తితో ఆడుతున్నానని తెలిపారు. ఈ మ్యాచ్ చూసేందుకు రావాలని కాంగ్రెస్ అగ్రనేతలను కూడా పిలిచానని రేవంత్ తెలిపారు.
అంతర్జాతీయ సాకర్ ప్రపంచంలో మెస్సీ ఓ ధృవతారు. ఆయన చాలా కాలం తర్వాత ఇండియాకు వచ్చారు. ఆయన టూర్ నిర్వాహకులు చాలా టైట్ షెడ్యూల్ ఖరారు చేశారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఓ ఈవెంట్ పెట్టారు. దానికి సీఎం రేవంత్ ను ఆహ్వానించారు. అయితే ప్రభుత్వమే ఏర్పాట్లు చేస్తోందన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కానీ రూపాయి కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టడం లేదని .. అదంతా ప్రైవేటు సంస్థ వ్యవహారమని రేవంత్ స్పష్టం చేస్తున్నారు.