తెలంగాణలోని ఉద్యోగుల సమ్మె ప్రకటన నేపథ్యంలో ఈ సమ్మె ఆలోచనను విరమించుకోవాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితి ఏంటో చెప్పే ప్రయత్నం చేశారు. ఇటీవల ఆయన పదేపదే అప్పు కూడా పుట్టడం లేదని, దేశమంతా ఇదే పరిస్థితి ఉందని నొక్కి చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు సమ్మెకు వెళ్తే పెనం మీద నుంచి పొయిలో పడినట్లే అవుతుందని వాస్తవ పరిస్థితిని అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నారు.
వాస్తవానికి రేవంత్ రెడ్డి వాస్తవ పరిస్థితిని పూర్తిగా జనం ముందు పెడుతున్నారు. తాము ప్రకటించిన హామీలు ఎందుకు అమలుకు నోచుకోవడం లేదో వివరిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలోని పథకాలను ముందుకు తీసుకెళ్లాలన్నా కూడా కష్టం అవుతోంది. పైగా కాంగ్రెస్ ఇచ్చిన హామీల సంగతి ఏంటి అని బీఆర్ఎస్ నిలదీస్తుండటంతో వాస్తవ ఆర్థిక పరిస్థితి ఏంటో ప్రజల ముందు పెడుతున్నారు. ఏదైనా చేద్దామన్నాఅప్పు పుట్టడం లేదని, ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకొని సమ్మెపై పునరాలోచించాలని ఉద్యోగ సంఘాలకు రేవంత్ విజ్ఞప్తి చేశారు. తనను కోసినా , ఒక్క రూపాయి ఎక్కువ రాదనీ ఉద్యోగులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
అయితే , రేవంత్ ప్రకటనపై ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందిస్తాయా? లేదా అనేది వేరే విషయం. కానీ, వాస్తవ పరిస్థితులను బహిరంగం చేసినంత మాత్రానా ప్రజల నుంచి సానుభూతి వస్తుందని అనుకోవడం మూర్ఖత్వమే. ధనిక రాష్ట్రమని బీఆర్ఎస్ హయాంలో ఎక్కువగా ప్రచారంలో ఉంచింది. ఇప్పుడు రేవంత్ అప్పు పుట్టడం లేదని అంటున్నారంటే..అది రేవంత్ వైఫల్యమేనని ఆయన నాయకత్వాన్ని నిందించేందుకు స్వయంగా ఆయనే చాన్స్ ఇచ్చినట్టు అవుతుంది.
ప్రత్యర్థులకు దొరక్కుండా రాజకీయ చతురతను ప్రదర్శించే నేర్పు ఉన్న రేవంత్..ఈ విషయంలో మాత్రం బీఆర్ఎస్ కు చాన్స్ ఇస్తున్నారని అంటున్నారు. కానీ, అసలు విషయన్ని జనం అర్థం చేసుకుంటారన్న ధీమా రేవంత్ లో కనిపిస్తోంది.