ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన కంపెనీపై కేసు నమోదు అయింది. అదికూడా భూకబ్జాకు ప్రయత్నించిన కేసు. ఇక్కడ ప్రభుత్వం సిన్సియర్ గా ఉంది.. అందుకే ఎవర్నీ వదిలి పెట్టలేదు అని చెప్పుకోవచ్చు కానీ.. అలాంటి కబ్జా ప్రయత్నం చేసి బయటపడటం, ఓ సిన్సియర్ అధికారి వల్ల కేసు నమోదు కావడంతో విషయం బయటకు వచ్చింది. అధికారం ఉందని అర్థరాత్రి పూట ఓ ప్రైవేటు వ్యక్తి స్థలంలోకి ప్రవేశించి కూల్చివేతలు చేయడాన్ని ఎవరు సహిస్తారు?. మంత్రిగా ఉన్న వ్యక్తి మరింత బాధ్యతగా ఉండాలి. కానీ ఇక్కడ జరిగింది వేరు. అందుకే పొంగులేటి తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
పొంగులేటి రాజకీయ వ్యాపారం
బడా కాంట్రాక్టర్ గా ఎదిగి రాజకీయాల్లోకి వచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అధికారంతో మరింతగా సంపాదించాలనుకోవడం వల్ల ఆయన ఉన్న పార్టీలు బద్నాం అయిపోతున్నాయి. వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేసి ఎవరూ ఊహించనంతగా ఖర్చు పెట్టి గెలిచిన ఆయన ఆ తర్వాత డబ్బుతో శాసించడం కామన్ అయిపోయింది. వైసీపీకి భవిష్యత్ లేదని తెలియడంతో బీఆర్ఎస్లో చేరిపోయారు. కానీ అక్కడ ఆయన దందాల గురించి స్పష్టత ఉందేమో కానీ కేసీఆర్ పెద్దగా ప్రోత్సహించలేదు. చాన్స్ ఇస్తే మొత్తానికే ముంచేస్తాడని అనుకున్నారేమో నీ ఆయన దూరం పెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో ఆయన చేస్తున్న నిర్వాకాలు చూసి.. బీఆర్ఎస్ నేతలు కూడా కేసీఆర్ అందుకే ప్రోత్సహించలేదని చెప్పుకుంటున్నారు.
బీహార్ ఎన్నికల ఖర్చు పెట్టుకున్నారని ప్రచారం
పొంగులేటి రాజకీయ వ్యాపారం చేయడంలో పండిపోయారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు ఆయన ఆదాయవనరుగా మారారని చెప్పుకుంటున్నారు. బీహార్ ఎన్నికల్లో పార్టీ కోసం ఆయనే ఖర్చు పెట్టుకున్నారు. తనకు హైకమాండ్ వద్ద పలుకుబడి ఉందని.. ఆయన రెచ్చిపోతున్నారని కాంగ్రెస్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉండేవారు. ఆయన అన్ని పనులు,నిధులు తనకే కావాలన్నట్లుగా వ్యవహరిస్తూండటంతో ఎమ్మెల్యేల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. దాంతో రేవంత్ కూడా దూరం పెట్టారు. ఇప్పుడు పెద్దగా రేవంత్ తో కనిపించడం లేదు. కానీ తన దందాలు ఆపలేదు.
పొంగులేటి తీరుపై కాంగ్రెస్‌లోనే తీవ్ర అసంతృప్తి
మంత్రిగా ఉండి.. ఇలాంటికబ్జా ప్రయత్నాలు చేస్తే.. ఆయనకు మాత్రమే కాదు.. మొత్తం ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. దీని గురించి ఆయనకు పట్టింపు ఉండకపోవచ్చు. ఆర్థిక బలంతో చేస్తున్న రాజకీయాలతో ఆయనను రేపు ఏ పార్టీ అయినా పిలిచి ప్రాధాన్యం ఇవ్వొచ్చు. ఆయనకు పార్టీ ప్రధానం కాదు.. కేవలం వ్యాపారమే. ఇలాంటి మంత్రులతో కాంగ్రెస్ రెండేళ్లు పాలన పూర్తి చేస్తోంది. మరి ప్రజల్లోవ్యతిరేకత వస్తోంది అనే ప్రచారం ప్రారంభమవుతోందంటే.. అవకుండా ఉంటుందా ?