తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సుడిగుండంలో చిక్కుకున్నట్లుగా కనిపిస్తోంది. బకాయిలన్నీ పేరుకుపోవడంతో.. స్కూళ్లు, ఆస్పత్రులు, కాంట్రాక్టర్లు, ఉద్యోగులు ఇలా ఒకరి తర్వాత ఒకరు తిరుగుబాటు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు వారిని బుజ్జగించడానికి ఎంతో కొంత ఇవ్వడానికి కూడా ప్రభుత్వం వద్ద నిధులు లేవు. బెదిరించడానికే చేసే ప్రయత్నాలూ ఫలించే సూచనలు కనిపించడం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా ఎప్పుడూ వెసులుబాటు పరిస్థితుల్ని అనుభవించలేదు కానీ ఇప్పుడు పరిస్థితి మరింత తీవ్రమైంది.
కాలేజీలు, ఆస్పత్రులకు ఎంతో కొంత చెల్లించాల్సిన అవసరం
ఫీజు రీఎంబర్స్ మెంట్ నిధులు రావడం లేదని దాదాపుగా వెయ్యి కాలేజీలను బంద్ చేశారు. 13 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. సెమిస్టర్ పరీక్షలు ఆలస్యమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఫీ రీయింబర్స్మెంట్ల కోసం రూ. 7,500 కోట్లు విడుదల చేయాలని కాలేజీలు కోరుతున్నాయి. బడ్జెట్లో ఇప్పటికే రూ. 1,200 కోట్లు కేటాయించినా , అవి విడుదల చేయలేకపోయారు. ఆరోగ్యశ్రీకి నిధుల విషయంలోనూ అదే పరిస్థితి. ఇప్పటికే ఉద్యోగులు తమకు రావాల్సిన బకాయిల విషయంలో సమ్మె చేస్తామని అంటున్నారు. బిల్లుల కోసం కాంట్రాక్టర్లు కూడా రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు.
డబ్బులు లేవంటున్న రేవంత్ !
సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై ఎక్కువగా మాట్లాడుతున్నారు. బహిరంగ సమావేశాల్లో కూడా “ఇవ్వడానికి భుత్వం వద్ద డబ్బూ, భూమి లేవు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంది. కొత్త అప్పులు కూడా పుట్టడం లేదు” అని చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలపై ఇతర వర్గాల నుంచి విమర్శలు వస్తున్నా ఆ భారం మోయాల్సింది రేవంత్ రెడ్డే కాబట్టి ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని ఆయన నేరుగా అందరికీ చెబుతున్నారు. అలాగని.. ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన వాటిని చెల్లించకపోతే.. ఎంతో కాలం ఇతర వర్గాలు ఆగే అవకాశం ఉండదు. ఇప్పుడు అదే జరుగుతోంది.
బెదిరింపులు పని చేయవు !
కాలేజీలు బంద్ ప్రకటించడంతో.. ప్రభుత్వం విజిలెన్స్ రిపోర్టు పేరుతో ఆయా కాలేజీల యాజమాన్యాలను భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. కేసీఆర్ హయాంలోనూ ఇలాంటి సమస్యలు వస్తే.. కాలేజీల్లో విజిలెన్స్ తనిఖీలు నిర్వహించ చేశారు. అన్ని కాలేజీల గుట్టుముట్లను నివేదిక రూపంలో రెడీ చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మాట వినకపోతే ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు పంపుతున్నారు. ఆస్పత్రులకూ ఇలాంటి హెచ్చరికలు వెళ్లవచ్చు. అయితే.. ఆయా రంగాలన్నీ ప్రజా సేవలతో ముడిపడి ఉన్నాయి. వాటిని బెదిరించడం ద్వారా వచ్చే ప్రయోజనాల కన్నా.. ఎంతో కొంత నిధులు చెల్లించడం ద్వారా.. దారిలోకి తెచ్చుకోవడం మంచిదన్న అభిప్రాయం వినిపిస్తోంది.
రేవంత్ ప్రభుత్వం వస్తున్న ఆదాయానికి,చేస్తున్న ఖర్చులకు పొంతన ఉండటంలేదు. అందుకే ఎప్పటికప్పుడు భూముల్ని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఖర్చులు, బకాయిలు కొండంత ఉన్నాయి. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వానికి పెను సవాళ్లు ఎదురవుతున్నాయి.