హైదరాబాద్‌లో కురిసిన తొలి భారీ వానకే నగరం జలమయం కావడం, ట్రాఫిక్ స్తంభించడంతో ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. వర్షాకాలం ముందస్తు చర్యలు చేపట్టడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని అంటున్నారు. ఈ విమర్శలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించిన తీరు, ఆయన ఎంచుకున్న పొలిటికల్ లైన్ .. రేవంత్ లెక్క వేరే అన్నట్లుగా ఉంది. అధికారులతో జరిగిన సమీక్షలో అంతర్జాతీయ నగరం అని గొప్పలు చెప్పుకుంటే సరిపోదు.. ఇదేనా మీ పదేళ్ల అభివృద్ధి అని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎదురుదాడే రేవంత్ ప్లాన్
రాజకీయాల్లో ఏ ప్రభుత్వానికైనా నగరాల్లో వరదలు, ట్రాఫిక్ జామ్‌లు అనేవి పరిపాలనా పరంగా పెద్ద మైనస్ పాయింట్లుగా మారుతాయి. సాధారణంగా పాలకులు ఇలాంటి సమయాల్లో సమర్థన ఇచ్చుకుంటూ డిఫెన్స్‌లో పడిపోతారు. కానీ రేవంత్ రెడ్డి శైలి ఇందుకు పూర్తి భిన్నం. ఆయన రక్షణలోకి వెళ్లకుండా, దూకుడుగా కౌంటర్ అటాక్ చేశారు. హైదరాబాద్ నేడు ఈ పరిస్థితికి రావడానికి కారణం గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన చెరువుల కబ్జాలు, సక్రమమైన ప్రణాళిక లేని నిర్మాణాలేనని ప్రజల మైండ్లోకి బలంగా తీసుకెళ్లడంలో ఆయన సఫలమయ్యారు.
గ్లోబల్ సిటీ ఇమేజ్ భ్రమలను బద్దలు కొట్టడం
గత పదేళ్లుగా బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్‌ను ఒక గ్లోబల్ సిటీ గా, అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు ఉన్న నగరంగా బ్రాండింగ్ చేసుకుంటూ ఎన్నికల్లో ఓట్లు అడుగుతోంది. రేవంత్ రెడ్డి సరిగ్గా ఇదే పాయింట్‌ను టార్గెట్ చేశారు. రెండు గంటల వానకే నగరం మునిగిపోతుంటే.. మీరిచ్చిన గ్లోబల్ సిటీ బిల్డప్ ఎక్కడ పోయింది? అని ప్రశ్నించడం ద్వారా బీఆర్ఎస్ నిర్మించుకున్న అభివృద్ధి నరేటివ్ ను దెబ్బతీశారు. కేవలం నినాదాలు కాకుండా, క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఎలా ఉన్నాయో ప్రజలకు చూపించాలనేది ఆయన వ్యూహం.
హైడ్రా, చెరువుల పునరుద్ధరణకు మద్దతు
రేవంత్ రెడ్డి కబ్జాల ప్రస్తావన తీసుకురావడం వెనుక ఒక దీర్ఘకాలిక వ్యూహం ఉంది. నగరంలో చెరువులు, నాళాల కబ్జాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా చర్యలను సమర్థించుకోవడానికి ఈ వరద పరిస్థితిని ఆయన ఒక బలమైన ఆయుధంగా వాడుకుంటున్నారు. మేము కబ్జాలను కూల్చేస్తుంటే ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.. కానీ ఆ కబ్జాల వల్లే నేడు సామాన్యుడు రోడ్లపై నరకం చూస్తున్నాడు అనే భావనను క్రోడీకరించి, రాబోయే రోజుల్లో కబ్జాల లీగల్ యాక్షన్‌కు ప్రజా మద్దతు కూడగట్టే ప్రయత్నమిది.
హైదరాబాద్ వాన రాజకీయం అనేది కేవలం డ్రైనేజీల సమస్య కాదు.. అది కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి మధ్య జరుగుతున్న ఒక హై-వోల్టేజ్ మైండ్ గేమ్. కేటీఆర్ ఈ వానను కాంగ్రెస్ అసమర్థతగా చూపిస్తుంటే, రేవంత్ రెడ్డి దాన్ని బీఆర్ఎస్ పదేళ్ల పాపాల భైరవపాత్రగా తిప్పికొడుతున్నారు. సమస్య ఏదైనా సరే, దాన్ని తన వైపు తిప్పుకుని ప్రత్యర్థిని ఇరుకున పెట్టే ఈ ‘స్ట్రీట్ స్మార్ట్’ రాజకీయం రేవంత్ రెడ్డి మార్క్. ఇప్పుడు అదే కనిపిస్తోంది.
