తెలంగాణ ప్రభుత్వ పెద్దల్ని టార్గెట్ చేసుకుని రేవంత్ రెడ్డి విమర్శలు దాడి పెంచారు. కేసీఆర్, కేటీఆర్ మరో ఏడుగురు ఐఏఎస్ అధికారులతో డీ9 గ్యాంగ్ గా ఏర్పడి హైదరాబాద్‌ను దోచుకున్నారని అంటున్నారు. ఆయన పెడుతున్న ప్రెస్మీట్లు, బయట పెడుతున్న అంశాలు సంచలనంగా మారుతున్నాయి. తాజాగా ఆయన హైదరాబాద్‌లో కేబీఆర్ పార్క్ పక్కనే నిర్మిస్తున్న ఓ 21 అంతస్తుల భవనం గురించి తీవ్ర ఆరోపణలు చేశారు.
నందినగర్‌లో కేసీఆర్ నివాసానికి కాస్తంత దూరంలో ఉండే ఈ స్థలంలో ఒకప్పుడు పురాతన భవనం ఉండేది. దాన్ని కూలగొట్టేసి అక్కడ నమస్తే తెలంగాణ కార్యాలయం కడుతున్నారని ఆరేడేళ్లుగా ప్రచారం ఉంది. ఇప్పుడీ స్థలం కేసీఆర్ కుటుంబం చేతికి ఎలా వెళ్లిందో రేవంత్ రెడ్డి కొన్ని వివరాలు వెల్లడించారు. కుర్రా శ్రీనివాసరావు అనే వ్యక్తి కొన్న స్థలంలో నిర్మాణాల కోసం అనుమతుల కోసం కొంత భూమిని లంచంగా అడిగారని ఆరోపించారు. ఇరవై శాతం భూమిని తీసుకుని గ్రీన్ జోన్ లో ఉన్న వారసత్వ బిల్డింగ్ ను కూలగొట్టి కొత్త నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చారని ఆరోపించారు.
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల 5 అంతస్తుల భవనానికి పర్మిషన్ ఇవ్వని చోట.. 21 అంతస్తులకు పర్మిషన్ ఇచ్చారని తెలిపారు. 3 వేల గజాల స్థలంలో 21 అంతస్థులకు ఎలా పర్మిషన్ ఇచ్చారని ప్రశ్నించారు. పక్కనే ఉన్న బసవతారకం ఆస్పత్రికి 3 అంతస్తుల కంటే ఎక్కువ పర్మిషన్ ఇవ్వలేదని చెబుతున్నారు. ఏడుగురు ఐఏఎస్ లు, ఇద్దరు తండ్రీ కొడుకులు కలిసి డీ 9 గ్యాంగ్ గా మారారని విమర్శించారు. 20 శాతం భూములు రాసిచ్చిన వారికే నిర్మాణాలకు అనుమతిచ్చారని ఆరోపించారు రేవంత్.
రేవంత్ రెడ్డిఇలా కేసీఆర్ భూదందాలపై ప్రత్యేకంగా ఆరోపణలు చేయడానికికారణం… ఆంధ్రజ్యోతి ఆర్కే అనుకోవచ్చు. ఆయన గత వారం కొత్త పలుకులో కేసీఆర్ అన్ని వేల కోట్లు ఎలా సంపాదించారనే విషయాన్ని బయట పెట్టారు. భూముల దందా చేస్తున్నారని వివరించారు. ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటు పరం చేయడం.. ఇష్టారీతిన అనుమతులు ఇవ్వడం వంటి వాటి ద్వారా వేల కోట్ల పోగేశారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అలాంటి వాటిని రేవంత్ బయట పెడుతున్నారు. ఇవన్నీ ముందు ముందు సంచలనం అయ్యే అవకాశాలు ఉన్నాయి.