దేశంలో మెట్రోపాలిటన్ నగరాల్లో జీవించలేని పరిస్థితులు దాపురించాయని, హైదరాబాద్ కు అలాంటి పరిస్థితి రావొద్దని హైడ్రాను తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం బుద్ధభవన్ లో హైడ్రా పోలీసు స్టేషన్ ను ప్రారంభించిన అనంతరం సీఎం మాట్లాడారు. ఇందులో హైడ్రాను తీసుకురావడానికి గల బలమైన కారణం ఏంటో వివరించమే లక్ష్యంగా ప్రసంగించారు. ముంబై, చెన్నై వంటి నగరాల్లో వరదలు వస్తే 2,3అంతస్తులు మునిగిపోయాయని, హైదరాబాద్ అలాంటి దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్లవద్దనేది హైడ్రా ఉద్దేశమన్నారు.
హైడ్రాపై అంటేనే ఇళ్లు కూల్చేది అన్నట్లుగా దుష్ప్రచారం చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఈ విషయాన్ని ఎక్కువగా హైలెట్ చేసింది.అసలు హైడ్రా ప్రాముఖ్యత ఏంటో రేవంత్ మొదట్లో చెప్పినప్పటికీ దాని వలన ఎక్కువమంది పేదలు నిర్వాసితులు కావడంతో ప్రభుత్వ వాదన తేలిపోయింది. దీంతో హైడ్రా అంటేనే పేదల నివాసాలను ధ్వంసం చేసే వ్యవస్థ అని నగర ప్రజల మనస్సులో బలంగా నాటుకుపోయింది. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా హైడ్రాను రేవంత్ సర్కార్ కొనసాగిస్తోంది.
మొదట్లో ఈ హైడ్రాపై తీవ్ర విమర్శలు రావడం, రేవంత్ పై వ్యతిరేకతకు హైడ్రాతోనే బీజం పడటంతో ఇది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుందనే వాదనలు వినిపించాయి. కానీ రేవంత్ మాత్రం తాము సదుద్దేశ్యంతోనే ఈ వ్యవస్థను తీసుకొచ్చామని, వెనక్కి తగ్గేది లేదని చెప్పుకొచ్చారు. గతంలో చెప్పినట్టుగానే తాజాగా హైడ్రాకు ప్రత్యేక పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రారంభించారు. వాహనాలను కూడా కేటాయించారు. చేస్తున్న మంచి పనికి ఆలస్యంగానైనా గుర్తింపు ఉంటుందని రేవంత్ నమ్మకం. అందుకే హైడ్రాపై విమర్శలను ఆయన లెక్క చేయడం లేదు.
ఏదీ ఏమైనా, హైడ్రా విషయంలో రేవంత్ కొంత కేరింగ్ తీసుకోవడం మంచిది. లేదంటే..హైదరాబాద్ లో వరదల నివారణ కోసం రేవంత్ చేస్తున్న యజ్ఞానికి అర్థమే ఉండదు సరికదా.. మరిన్ని విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉంది.