Lరేవంత్ పలుకుబడి తగ్గిపోయిందని .. ఆయనకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని.. డిసెంబర్లో సీఎం మార్పు ఉంటుందని బీఆర్ఎస్ మీడియా, సోషల్ మీడియా కొంత కాలం ఘోషిస్తున్నాయి. తమ కార్యకర్తల్లో అదే నిజం అనే నమ్మకాన్ని పెంచుతున్నాయి. రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి తప్పిస్తే ఇక బీఆర్ఎస్కు తిరుగు ఉండదని కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారు. కానీ ఢిల్లీలో రేవంత్ పలుకుబడి ఎవరూ ఊహించని రేంజ్ లో ఉందని.. జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి.
ఉపరాష్ట్రపతి అభ్యర్థిని సిఫారసు చేసిన రేవంత్ రెడ్డి
ఇండీ కూటమికి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి లాంటి న్యాయకోవిదుడు లభించారు. గెలిచే అవకాశం లేని స్థానంలో ఓ నిపుణుడ్ని పెట్టి బీజేపీపై నైతిక యుద్ధం చేయాలని ఇండీ కూటమి అనుకుంది. అలా ఎవరు దొరుకుతారా అని సెర్చ్ చేస్తున్న సమయంలో రేవంత్ రెడ్డి చాలా ఈజీగా ఆ సమస్యను పరిష్కరించారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఒప్పించి.. ఆయన పేరును ఖరారు చేయించారు. ఆయన పేరు చెప్పిన వెంటనే ఇండీ కూటమి పార్టీలన్నీ అంగీకరించారు. రేవంత్ పై హైకమాండ్ లో ఏ చిన్న వ్యతిరేకత ఉన్నా అసలు పేరు సిఫారసు చేసేదాకా చాయిస్ ఇచ్చే వాళ్లు కాదు.
రేవంత్ ను జాతీయ స్థాయిలో ప్రభావం చూపే నేతగా చూస్తున్న హైకమాండ్
రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ జాతీయ స్థాయిలో ప్రభావం చూపగల నేతగా చూస్తోంది. అందుకే ఆయనను ఇతర సాధారణ నేతల్లా ట్రీట్ చేయడం లేదు. ఆయనకు అత్యంత కీలక సమావేశాలకు ఆహ్వానం ఉంటుంది. అంతే కానీ కర్టసీకి పిలిచి ఫోటోలు దిగే స్థాయిలో ఆయన లేరని సంకేతాలు పంపుతారు. రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ మార్క్ రాజకీయం చేస్తున్నారు. హైకమాండ్ పై ఎప్పుడూ లేనంత అభిమానం చూపిస్తున్నారు. విధేయత ప్రదర్శిస్తున్నారు. రేవంత్ రెడ్డి అసాధారణ పోరాటపటిమ ఉన్న లీడర్ అని.. ఆయనకు జాతీయ స్థాయి ప్రాధాన్యం ఉంటుందని హైకమాండ్ తరచూ తన చర్యల ద్వారా నిరూపిస్తూనే ఉంది.
రేవంత్ పలుకబడిపై కేటీఆర్ సహా బీఆర్ఎస్ పెట్టుకున్న బెంగ తీరిపోయినట్లే !
కాంగ్రెస్ పార్టీని కాకుండా.. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేసుకుని బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోంది. రేవంత్ లేకపోతే కాంగ్రెస్ పార్టీ తమను ఏమీ చేయలేదన్న ధీమా కావొచ్చు. రేవంత్ ను బలహీనం చేయడానికి..కాంగ్రెస్ హైకమాండ్ వద్ద ఉన్న పలుకుబడి తగ్గిపోయిందని ప్రచారం చేయడం ప్రారంభించారు. ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా బూతద్దంలో చూపించేవారు. నేరుగా కేటీఆర్ కు ట్యాగ్ చేసి కేటీఆర్ ట్వీట్లు చేసేవాళ్లు. కేటీఆర్, హరీష్ రావు అదే చెప్పేవారు. రేవంత్ కు అపాయింట్ మెంట్ రాహుల్ ఇవ్వడం లేదని ఆయన పనైపోయిందని చెప్పేవారు. కానీ ఇప్పుడు రేవంత్ మరింత బలమైన నేతగా మారారని.. నేరుగా ఇండీ కూటమికి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని అసువుగా సిఫారసు చేసే స్థాయికి వెళ్లిపోయారని ఇప్పుడు గుర్తించాల్సి వస్తోంది.