రిజర్వేషన్లు తేలే అంశం కాకపోవడంతో ప్రజల్ని ఏదో విధంగా కన్విన్స్ చేసి.. స్థానిక ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిసైడయ్యారు. ప్రభుత్వ సూచనల మేరకు తుది ఓటర్ల జాబితాను ప్రకటించడానికి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చింది. వచ్చేనెల రెండో తేదీ కల్లా తుది జాబితా ప్రకటిస్తారు. ఆ తర్వాత రెండు, మూడు రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది.
ఎన్నికలు నిర్వహించకపోతే స్థానిక సంస్థల నిధులు ఆగిపోయే ప్రమాదం
స్థానిక సంస్థలకు కేంద్రం ఆర్థిక సంఘం నిధులు ఇస్తుంది. స్థానిక సంస్థలు ఉనికిలో లేకపోతే ఆ నిధులు విడుదల కావు పంచాయతీలకు ప్రస్తుతం ప్రభుత్వాలు నిధులు కేటాయించడం కష్టంగా మారింది. పంచాయతీల ఆదాయాలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. కానీ ఖర్చులు మాత్రం పెరుగుతున్నాయి. పూర్తిగా కేంద్ర ఆర్థిక సంఘం నిధుల మీదనే ఆధారపడే ఎక్కువ పంచాయతీలు ఉన్నాయి. వాటికి ఇప్పుడు నిధులు రావాలన్నా .. ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది.
రిజర్వేషన్ల సమస్య తీరేది కాదు !
బీసీలకు తాత్కాలికంగా అయినా 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి అయినా ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. చివరికి రాజకీయ పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే విపక్షాల నుంచి విమర్శలు వస్తాయి. వాటిని ఎదుర్కోవడానికి ఆయన .. బీసీలకు పార్టీ పరమైన అవకాశాలు కల్పించనున్నారు. ఇతర పార్టీలు కూడా తనను ఫాలో అవ్వాల్సిన పరిస్థితి కల్పిస్తారు. అవకపోతే బీసీలకు రిజర్వేషన్లు కల్పించే చిత్తశుద్ధి లేదని వాదిస్తారు. రేవంత్ రాజకీయం .. ఎప్పుడూ ఎటాకింగ్ స్టైల్లోనే ఉంటుంది. ఇప్పుడు కూడా అలాగే ప్లాన్ చేసుకున్నారు.
పంచాయతీలు, జడ్పీ, మండలాలపై పట్టు సాధించడం కీలకం
స్థానిక ఎన్నికలను ఎలా నిర్వహించాలో గతంలో కేసీఆర్ చూపించారు. అప్పటికప్పుడు అనుకూలమైన చట్టాలు చేసుకుని ఎన్నికలు నిర్వహించారు. ఆ చట్టాలే ఇప్పుడు ఉన్నాయి. వాటిని ఎలా ఉపయోగించుకోవాలో రేవంత్ రెడ్డికి ఇంకా బాగా తెలుసని అంచనా వేస్తున్నారు. అందుకే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే అత్యధిక స్థానాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇంకా లేటు చేయడం ఎందుకని.. అందరూ ఓ నిర్ణయానికి వచ్చారు. కోర్టుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ఎదురుగా ఉంది.