ఆపరేషన్ సింధూర్ తో దేశమంతా భారత సైన్యానికి జేజేలు పలుకుతోంది. సెలబ్రిటీలు, రాజకీయ నేతలు , సామాన్యులు అంతా సైన్యం యుద్దపరాక్రమాన్ని వేనోళ్ళ పొగుడుతున్నారు. భారత సైన్యంకు నైతిక స్థైర్యాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారత సైన్యానికి మద్దతుగా ప్రభుత్వం తరఫున క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీపై కొంతమంది పెదవి విరిచినా , శాంతి భద్రతలను పర్యవేక్షించిన తర్వాతే రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
భారీ స్థాయిలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన తర్వాత తాజాగా రేవంత్ మరో ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. నేషనల్ డిఫెన్స్ ఫండ్స్ కు తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఒకనెల విరాళం ఇవ్వాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల వేతనాన్ని డిఫెన్స్ ఫండ్స్ కు ఇవ్వనున్నారు. ఈ విషయంపై రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో చర్చించారు. అనంతరం రేవంత్ నిర్ణయాన్ని ప్రజా ప్రతినిధులకు వివరించారు భట్టి. అందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా అంగీకారం తెలిపారు.
కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. రేవంత్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ మిగతా పార్టీల నేతలు సైతం ముందుకు రావాలని డిమాండ్లు వస్తున్నాయి. ప్రతిపక్షాలు కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా…భారత్ – పాక్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా భద్రతను పటిష్టం చేయాలని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు.