తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిల మధ్య నడిచిన పొలిటికల్ సవాళ్లు ఇప్పుడు ఊహించని మలుపు తిరిగాయి. జూన్ 15వ తేదీ తర్వాత చూస్తాం.. జూన్ 15 తర్వాత కేంద్రంపై పోరాటం చేస్తాం అంటూ సీఎం రేవంత్ రెడ్డి పెట్టిన డెడ్‌లైన్ దాటి వారం రోజులు గడిచిపోయింది. అయితే, ఆయన గతంలో హెచ్చరించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కట్టడి చేసేలా గానీ, కేంద్రంపై ప్రత్యక్ష పోరాటానికి దిగేలా గానీ ఎలాంటి క్షేత్రస్థాయి వ్యూహాలు అమలు చేయడం లేదు. కానీ కలసి పని చేద్దాం రమ్మని పిలిచారు.
సవాళ్లు పక్కనబెట్టి.. కలిసి ప్రయత్నిద్దామని లేఖలు !
అడ్డుకుంటాం, నిలదీస్తాం అన్న రేవంత్ రెడ్డి వైఖరిలో ఇప్పుడు స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. పంతాలకు పోయి కేంద్రంతో ఘర్షణ పడటం కంటే, సామరస్యంగా ముందుకెళ్లడమే ఉత్తమమనే లౌక్యాన్ని ఆయన ప్రదర్శిస్తున్నారు. దీనికి నిదర్శనంగానే.. ఇటీవల కిషన్ రెడ్డితో కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ పెద్దల వద్దకు వెళ్దామంటూ లేఖలు రాస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకవైపు రాజకీయ విమర్శలు చేస్తూనే, మరోవైపు లేఖలు పంపడం ద్వారా రేవంత్ రెడ్డి తన దూకుడును తగ్గించుకుని మిడ్-టర్మ్ కరెక్టివ్ మోడ్‌లోకి వచ్చారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ధాన్యపు గింజల వివాదం.. సైలెంట్ అయిన రాష్ట్ర సర్కార్!
రాష్ట్రంలో అత్యంత కీలకమైన ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎలాంటి అదనపు సేకరణ కటించకపోయినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో సైలెంట్‌గా ఉండిపోవడం చర్చనీయాంశమైంది. గతంలో బీఆర్ఎస్ హయాంలో ధాన్యం కొనుగోళ్లపై ఢిల్లీ వీధుల్లో జరిగిన స్థాయిలో ధర్నాలు, ఆందోళనలు చేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధంగా లేదని స్పష్టమవుతోంది. కేంద్రంతో నేరుగా ఢీకొడితే రాష్ట్ర ఆర్థిక వనరులపై, నిధుల విడుదలపై పడే ప్రతికూల ప్రభావాన్ని అంచనా వేసుకునే ముఖ్యమంత్రి ఈ వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయించారని అనుకోవచ్చు.
పంతాల కన్నా పనులే ముఖ్యం
రేవంత్ రెడ్డి కేవలం కిషన్ రెడ్డితో సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకోవడం కన్నా.. ఆయనతో కలిసి ఢిల్లీలోని పెద్దల వద్దకు పోయి రాష్ట్రానికి రావాల్సిన పనులు చేయించుకోవడమే ఉత్తమమైన మార్గం అనుకుంటున్నారు. కిషన్ రెడ్డికి కేంద్ర కేబినెట్లో ఉన్న ప్రాధాన్యతను వాడుకుని, విభజన హామీలు, నిధులను రాబట్టడంపై రేవంత్ రెడ్డి దృష్టి సారించడమే రాష్ట్రానికి మేలు చేస్తుందని అందరికీ తెలుసు. వచ్చే రెండు రోజుల్లో కిషన్ రెడ్డి… రేవంత్ ను అశ్వనీ వైష్ణవ్ వద్దకు తీసుకుపోయి మెట్రో రైల్ ..లోన్ సాంకేతిక ఇబ్బందుల్ని తీర్చేలా చేయగలిగితే కిషన్ రెడ్డి ఇమేజ్ పెరుగుతుంది.
