రేవంత్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తున్నందున నిర్వహిస్తున్న ప్రజా విజయోత్సవాలను తెలంగాణ ప్రభుత్వం వినూత్నంగా ప్లాన్ చేసింది. భజన కాకుండా.. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసేందుకు.. బడుగు, బలహీనవర్గాలకు అవసరం అయిన వాటి పనులే ప్రారంభిస్తున్నారు. మొత్తం తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తున్న విజయోత్సవాల్లో మొదటి రోజు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు శంకుస్థాపనలు చేస్తారు. తర్వాత వరుసగా మెడికల్, హైదరాబాద్ లో అభివృద్ధి పనులు, ఫారెస్ట్ డెవలప్మెంట్, ఇందిరా మహిళా శక్తి బజార్లు, యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవ వంటివి ఉన్నాయి.
ఇక డిసెంబర్ తొమ్మిది తేదీన మాత్రం వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆ రోజు తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసిన రోజు కాబట్టి ఆ సెంటిమెంట్ ప్రజల్లో పెంచి తెలంగాణ ఇచ్చింది.. తెచ్చింది కాంగ్రెస్సేనన్న భావన పెంచేందుకు ప్రయత్నించనున్నారు. ఇదంతా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించనున్నారు. సహజంగానే ఈ వేడుకల్లో బీఆర్ఎస్ పార్టిసిపేట్ చేయదు. జూన్ రెండో తేదీన తెలంగాణ అవిర్భవించిందని కేసీఆర్ సాధించారని ఆ తేదీకి స్టిక్ అయిపోయింది.
తెలంగాణ ప్రభుత్వం తమపై వ్యవస్థీకృత వ్యతిరేకత ప్రచారం జరుగుతోందని గుర్తించింది. దాన్ని తిప్పికొట్టేలా పాలన అంతా ప్రజల కోసమే జరుగుతోందని నిరూపించేలా ఈ విజయోత్సవాలను నిర్వహించాలని అనుకుంటున్నారు. విజయోత్సవాలంటే కాంగ్రెస్ విజయోత్సవాలు అన్న భావన లేకుండా..ప్రజా విజయోత్సవాలు అన్నట్లుగా నిర్వహిస్తే పాజిటివ్ ఇమేజ్ పెరిగే చాన్స్ ఉంది.