రాజకీయ నాయకులు, సినీ నటులు.. వీళ్ల కలయిక చాలా సాధారణంగా జరిగేదే. సినిమా వేడుకల్లోనో, లేదంటే ఇతరత్రా ఫంక్షన్లలోనో ఆప్యాయంగా పలకరించుకోవడం, సరదాగా మాట్లాడుకోవడం చూస్తూనే ఉంటాం. అయితే వీటిలో రేవంత్ రెడ్డి – నాగార్జున కాంబోకున్న క్రేజ్ వేరు. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాక వీరిద్దరూ రెండుసార్లు కలిశారు. ఆ రెండుసార్లూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది వ్యవహారం.
నాగ్ కి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ పై హైడ్రా విరుచుకుపడిన సంగతి గుర్తుండే ఉంటుంది. అప్పట్లో అదో సంచలనం. చెరువుల్ని ఆక్రమించుకొని, అక్రమంగా భవనాల్ని నిర్మించారన్న కారణంలో హైడ్రా ఎన్ కన్వెన్షన్ లోని భవనాల్ని కూల్చివేసింది. ఆ తరవాత నాగ్ కోర్టుని ఆశ్రయించారు. కానీ రేవంత్ ఎక్కడా తగ్గలేదు. అప్పటి నుంచీ రేవంత్ – నాగ్ మధ్య గ్యాప్ మొదలైంది. అదెంత వరకూ కొనసాగుతుందో అని అంతా అనుకొన్నారు. కానీ కట్ చేస్తే నెల రోజులు తిరిగే లోపే ఇద్దరూ కలుసుకొన్నారు. ఇండస్ట్రీకి సంబంధించిన రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన ఓ మీటింగ్ లో నాగ్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రిని శాలువాతో సత్కరించారు. ఫొటోలకు నవ్వుతూ ఫోజులు ఇచ్చారు. ఇక అప్పుడే వీరిద్దరి మధ్య గ్యాప్ తొలగిపోయినట్టు అనిపించింది.
రీసెంట్ గా రేవంత్ – నాగ్ మళ్లీ కలిశారు. మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా ఏర్పాటు చేసిన విందులో నాగ్ మెరిశారు. రేవంత్, నాగ్ ఒకే టేబుల్ దగ్గర కూర్చుని విందు ఆరగించారు. వినోదాల్ని వీక్షించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. నాగ్ – రేవంత్ మధ్య గ్యాప్ ఏమీ లేదని, ఇప్పుడు ఇద్దరూ మంచి ఫ్రెండ్సయిపోయారని చెప్పడానికి ఇదో తార్కాణం.
అయితే ఈ విషయంలో నాగ్ తెలివితేటల్ని మెచ్చుకొని తీరాలి. ఎలాంటి క్లిష్టపరిస్థితుల్లో అయినా కూల్ గా తన పని తాను చేసుకుపోవడం ఆయనకు అలవాటు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, వాళ్లతో ఫ్రెండ్ షిప్ చేయడం, వాళ్ల మెప్పు పొందడం, ‘నేను మీ వాడ్నే’ అనేంత భరోసా ఇవ్వడం నాగ్ ముందు నుంచీ ఆచరిస్తున్న పద్ధతి. అందుకే అన్ని పార్టీలతో ఆయనకు స్నేహం ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే నాగ్ స్నేహహస్తం చాచి ఉంటే, రేవంత్ రెడ్డిని కాస్త సీరియస్గా తీసుకొని ఉంటే.. ఎన్ కన్వెన్షన్ ఇప్పటికీ సేఫ్ గా ఉండేదేమో. కాస్త ఆలస్యమైనా నాగ్ తన చాతుర్యం చూపించుకొన్నారన్నది నెటిజన్ల అభిప్రాయం.