జూబ్లిహిల్స్ ఉపఎన్నిక విషయంలో రేవంత్ రెడ్డి తన పంతం నెగ్గించుకునేదిశగా మరో అడుగు ముందుకేశారు. అక్కడి నుంచి తానే పోటీ చేస్తానని అజహరుద్దీన్ హడావుడి చేస్తున్నారు. నేరుగా సోనియా, రాహుల్ సిఫారసు తెచ్చుకున్నారు. నియోజకవర్గంలో పని చేసుకుంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి హఠాత్తుగా ఆయన పేరును గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఇద్దరూ మాజీలయ్యారు. ఈ కారణంగా ఇద్దరి పేర్లను తెలంగాణ కేబినెట్ సిఫారసు చేయాల్సి వచ్చింది.
కానీ రేవంత్ ఇక్కడే తెలివిగా ఆలోచించారు. ఉస్మానియాలో జరిగిన కార్యక్రమంలో కోదండరాంను పదిహేను రోజుల్లో మళ్లీ ఎమ్మెల్సీని చేస్తామని చెప్పారు. ఆ ప్రకారం ఆయన పేరును మరోసారి సిఫారసు చేశారు. మరో పేరు అయిన సియాసత్ చీఫ్ ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ పేరును మాత్రం ఈ సారి తప్పించారు. అజహరుద్దీన్ పేరును చేర్చి కేబినెట్ సిఫారసు చేసింది. కోదండరాం, అజహర్ పేర్లను గవర్నర్ కు పంపుతారు. వీరి నియామకం సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడే ఉంటుంది.
ఇప్పుడు అజహరుద్దీన్ ఎమ్మెల్సీ అవుతున్నందున జూబ్లిహిల్స్ లో ఆయన పోటీకి ఉండరు. ఆయన పేరు కూడా పరిశీలించరు. రేవంత్ రెడ్డి దృష్టిలో ఎవరో కీలక నేత ఉండబట్టే ఆయన ఇలా అజహర్ ను పక్కకు తప్పించారని భావిస్తున్నారు. ఆ కీలక నేత ఎవరు అన్నది మాత్రం బయటకు రానివ్వడం లేదు. బీఆర్ఎస్ పార్టీ కూడా అభ్యర్థి విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేకపోతోంది.