తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేదా అన్నదానిపై సందిగ్ధత నెలకొంది. హైకోర్టు కన్నా ముందే సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. తమ వాదన గట్టిగా వినిపించడానికి కాంగ్రెస్ తరపున ఓ టీమ్ ఢిల్లీ వెళ్లింది. అయితే అసెంబ్లీలో ఆమోదం పొందినప్పటికీ ఇంకా గవర్నర్ గెజిట్ జారీ చేయనందున ఆ బిల్లు ఆధారంగా ఇచ్చిన జీవో చెల్లదన్నా అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. న్యాయనిపుణులు కూడా అదే చెబుతున్నారు. అయితే బిల్లుతో సంబంధం లేకుండా జీవో ఇచ్చామని ప్రభుత్వం వాదించే అవకాశం ఉంది. అప్పుడు అయినా రిజర్వేషన్ల పరిమితి దాటుతుంది. అందుకే ఆ జీవో న్యాయపరమైన అడ్డంకులు దాటడం అసాధ్యమన్న అభిప్రాయం ఉంది.
న్యాయపరమైన అడ్డంకులు వచ్చినా ఎన్నికలకు ప్లాన్
ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ప్లాన్ బీ అమలు చేయాలనుకుంటోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. కోర్టులో గ్రీన్ సిగ్నల్ వస్తే.. తొమ్మిదో తేదీ నుంచి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు జరుగుతాయి. ఆటంకాలు వచ్చినా.. పాత జీవోలు ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేసి.. వారంలో మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చేలా ఎన్నికల సంఘాన్ని అప్రమత్తం చేసినట్లుగా భావిస్తున్నారు. తాము 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనుకున్నాం కానీ.. విపక్షాలు ఆటంకం కలిగించాయని.. అందుకే రాజకీయంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు నిర్వహిస్తున్నామని ప్రకటించే అవకాశం ఉంది.
పాత రిజర్వేషన్లతో వెంటనే షెడ్యూల్ – కానీ రాజకీయంగా 42 శాతం రిజర్వేషన్లు
కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 42 శాతం స్థానాల్లో రిజర్వేషన్లను ఖరారు చేసిన స్థానాల్లో బీసీ అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. పార్టీ నేతల నుంచి పేర్లను తీసుకుంది. అధికారికంగా రిజర్వేషన్లు లేకపోయినా ఇప్పుడు బీసీలకు కేటాయించిన స్థానాల్లో ఆ సామాజికవర్గం వారికే సీట్లు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. తాము 42 శాతం రిజర్వేషన్లు ఇస్తే ఇతర పార్టీల వారికీ ఇవ్వక తప్పదని.. అప్పుడు క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకే వస్తుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అన్ని రకాలుగా ఆలోచించే.. జీవోలు ఇచ్చారని స్థానిక ఎన్నికలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహిస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు నమ్ముతున్నాయి.
ఎన్నికల కోసం ఎదురు చూస్తున్న క్యాడర్
స్థానికలు జరగవని.. జరిగినా చెల్లవన్న అభిప్రాయంలో ఇతర పార్టీలు లైట్ తీసుకునే అవకాశం ఉంది. ఆ పార్టీలను ఏ మార్చాడానికి రేవంత్ వ్యూహం పనికి వస్తుందని అంచనా వేస్తున్నారు. అధికార పార్టీగా ఉన్న అడ్వాంటేజ్ తో .. రేవంత్ రెడ్డి ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో గెలవడానికి ఓ రోడ్ మ్యాచ్ రెడీ చేసుకున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. చట్టబద్ధంగా.. ఎలాంటి సమస్యలు లేకుండానే స్థానిక ఎన్నికలు జరుగుతాయని.. రేవంత్ రెడ్డి వ్యూహాలను బీఆర్ఎస్, బీజేపీ అంచనా వేయలేకపోతున్నారని … కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.