సీఎం రేవంత్ రెడ్డికి పాలనానుభవం లేదు. మంత్రిగా కూడా చేయకుండానే ముఖ్యమంత్రి అయ్యారు. కానీ అదేమీ సమస్య కాదని పాలన ద్వారా నిరూపిస్తున్నారు. కానీ పాలనకు, రాజకీయానికి మధ్య బాండింగ్ చూపించడంలో మాత్రం విఫలమమవుతున్నారు. రెండింటింకి లింక్ ఉంటుంది. ఉండేలా చూసుకోవాలి. లేకపోతే రాజకీయంగా సమస్యలు వస్తాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. హిల్ట్ పాలసీ బీఆర్ఎస్ నేతలకు అర్థం కాలేదని మంత్రి శ్రీధర్ బాబు చెబుతున్నారు. కానీ అర్థం కావాల్సింది బీఆర్ఎస్ నేతలకు కాదు.. ప్రజలకు అనే విషయాన్ని మాత్రం మరచిపోతున్నారు.
భూముల పాలసీ బీఆర్ఎస్దే – కాంగ్రెస్ నెత్తిపై!
కాంగ్రెస్ ఐదు లక్షల కోట్ల స్కాం చేస్తోందని .. పారిశ్రామికవేత్తలకు భూములను పప్పుబెల్లాల్లా అప్పగిస్తోందని ఓ ప్రచారం బీఆర్ఎస్ చేస్తోంది. అది ఏ స్థాయిలో చేస్తున్నారంటే.. రోజంతా బీఆర్ఎస్ నేతలది అదేపని . అసలు ఆ స్కామేటో.. భూములేమిటి .. గతంలో తమ ప్రభుత్వం తీసుకున్న పాలసీలపై చర్చ జరగనీయడం లేదు. భూములు అప్పనంగా ఇచ్చేసి సొంతానికి రేవంత్ డబ్బులు తీసుకుంటున్నారని ప్రజల మనసుల్లో రుద్దుతున్నారు. దీనికి కారణం అసలు ఆ హిల్ట్ పాలసీ గురించి ఎవరికీ తెలియదు. అందుకే బీఆర్ఎస్ పార్టీ చెప్పిన నేరెటివ్ ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. కౌంటర్ ఇవ్వడానికి కాంగ్రెస్ ఇబ్బంది పడుతోంది. గతంలో బీఆర్ఎస్సే మూడు జీవోలు ఇచ్చిందని చెబుతున్నారు. కానీ వారి మాటలు ఎవరూ వినడం లేదు.
ప్రజల్లో చర్చ పెట్టి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం పొలిటికల్ వ్యూహం
ప్రభుత్వంలో ఉన్న పార్టీ తమకు అధికారం ఉంది కదా అని ఏ నిర్ణయం అయినా తీసుకోలేరు. ఓ నిర్ణయం ప్రజలకు మంచి చేసేది అయినా.. దానికి కొన్ని వ్యతిరేక అంశాలు ఉంటాయి. వాటిని కూడా ప్రజలకు అర్థమయ్యేలా చేయగలగాలి. అలా చేయాలంటే.. ఓ పాలసీపై చర్చ జరగాలి. ఉదాహరణకు.. ఏపీలో ఆరోగ్యశ్రీ స్థానంలో యూనివర్శల్ హెల్త్ పాలసీని తీసుకు వస్తున్నారు. దాని గురించి ప్రభుత్వం చర్చ పెట్టింది. ప్రజలు మానసికంగా సిద్ధమవడానికి ఇది ఉపయోగపడుతోంది. అలాగే అమరావతి రెండో దశకు భూసమీకరణ అనే అంశంపైనా విస్తృతంగా చర్చకు పెట్టారు. ఇప్పుడు ఆ విషయంలో రహస్యాలు లేవు. కానీ తెలంగాణ ప్రభుత్వం అలా చేయడం లేదు. ఎప్పుడో ఫ్యాక్టరీలకు ఇచ్చిన భూములు సిటీల్లో భాగంగా మారిపోయి.. నిరుపయోగంగా ఉన్న వాటిని మల్టీయూజ్ గా మార్పు చేసి ఆదాయమర్గంగా చేసుకుందామని అనుకుంది. ముందుగా ప్రజల్లో చర్చ పెట్టకుండా నేరుగా నిర్ణయం తీసుకోడంతో బీఆర్ఎస్ అడ్వాంటేజ్ గా తీసుకుంది.
చివరికి విద్యుత్ కొనుగోళ్లూ స్కామే అని ఆరోపణలు
విద్యుత్ అవసరాల కోసం విద్యుత్ కొనుగోలు చేయడం అనేది కామన్. కేసీఆర్ చవకగా వస్తుందని విద్యుత్ ఉత్పత్తిని తగ్గించుకుని బహిరంగ మార్కెట్ నుంచి కొనుగోలు చేశారు. భారీ రేటు ఉన్నప్పుడు కూడా కొనుగోలు చేశారు. ఇప్పుడు రేవంత్ వేసవిలో సమస్యలు రాకుండా విద్యుత్ కొనాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ స్కాం ఆరోపణలు ప్రారంభించింది. రాబోయే విద్యుత్ కొరతపై ప్రజల్లో చర్చ పెట్టి.. మెరుగైన పాలసీ ద్వారా కొంటున్నామని ముందుగానే ప్రజలకు తెలిసేలా చేసి నిర్ణయం తీసుకుంటే ఈ సమస్య ఉండేది కాదు.
అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలను ప్రజల్లో చర్చ పెట్టకపోవడం వల్లనే బీఆర్ఎస్ .. ప్రతీ దాన్ని స్కాం అని ఆరోపణలు చేయగులుగుతోంది. అంతా అయిపోయాక ఇదీ నిజం అని కాంగ్రెస్ చెప్పినా ప్రజల్లోకి వెళ్లడం కష్టంగా మారుతోంది.