తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరంపై సీబీఐ విచారణకు సిఫారసు చేస్తూ అసెంబ్లీలో నిర్ణయం ప్రకటించారు. వెంటనే సీబీఐకి లేఖ రాశారు. అయితే చాలా మందికి ఒకటే విషయం గుర్తుకు వచ్చింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వమే సీబీఐకి తెలంగాణలో జనరల్ కన్సెంట్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా దాన్ని పునరుద్ధరించలేదు. మరి సీబీఐకి సిఫారసు చేస్తే ఎలా విచారణ చేస్తారన్నది ఆ సందేహం. ప్రభుత్వ పెద్దల దృష్టికి కూడా ఈ అంశం వెళ్లింది. అందుకే వెంటనే సీబీఐకి జనరల్ కన్సెంట్ ను పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ జేబు సంస్థలన్నది కాంగ్రెస్ విధానం
కాంగ్రెస్ పార్టీ కేంద్ర దర్యాప్తు సంస్థలను ఏ మాత్రం నమ్మడం లేదు. ఆ పార్టీ ,ఇండీ కూటమి పార్టీల జాతీయ విధానం చాలా స్పష్టంగా ఉంటుంది. దర్యాప్తు సంస్థలన్నీ బీజేపీ జేబు సంస్థలని వాటిని నమ్మే ప్రసక్తే లేదని చెబుతూంటారు. ఈడీ, సీబీఐ రాహుల్ గాంధీ , సోనియా గాంధీలను ఎలా ఇబ్బంది పెట్టాయో కళ్ల ముందే ఉంది. అందుకే రాహుల్ గాంధీ చాలా సార్లు సీబీఐను తీవ్రంగా విమర్శిస్తూ ట్వీట్లు కూడా పెట్టారు.
కాంగ్రెస్ విధానానికి భిన్నంగా రేవంత్ రాజకీయాలు
రేవంత్ రెడ్డి తెలంగాణలో రాజకీయాలు కాంగ్రెస్ విధానానికి విరుద్ధంగా నిర్వహిస్తున్నారు. ఇపుడు కాళేశ్వరంపై విచారణను కేంద్రానికి సిఫారసు చేశారంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలపై విశ్వాసం చూపించినట్లే. నమ్మకం ఉందని అంగీకరించినట్లే. ఇది కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయపై ప్రశ్నలు రేకెత్తేలా చేస్తుంది. రాహుల్ చెబుతున్నదేంటి… తెలంగాణ కాంగ్రెస్ చేస్తున్నదేమిటి అన్న ప్రశ్నలు వస్తాయి. ఈ నిర్ణయం తీసుకునేముందు రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్ అనుమతి తీసుకున్నారో లేదో తెలియదు కానీ.. బీజేపీ.. కాంగ్రెస్ ప్రభుత్వమే సీబీఐపై నమ్మకంతో కేసులు అప్పగిస్తుందని.. రాహుల్ ఎలా విమర్శిస్తారని ఎదురుదాడి చేసేందుకు ఓ అవకాశం మాత్రం రేవంత్ ఇచ్చినట్లయింది.
రేవంత్ రాజకీయంపై భిన్నాభిప్రాయాలు
కాళేశ్వరంపై చర్యలు తీసుకుంటే కక్ష సాధింపులు అని.. బీఆర్ఎస్ పార్టీకి సానుభూతి వస్తుందని రేవంత్ భావించి..అదేదో బీజేపీ మీదకు నెట్టేశారు. చర్యలు తీసుకుంటే సానుభూతి రాదు.. తీసుకోకపోతే.. వారిద్దరూ కుమ్మక్కయ్యారని చెప్పవచ్చని ఆయన ప్లాన్ కావొచ్చు. అందుకే ఇక్కడ మైనస్ పాయింట్ల గురించి ముఖ్యంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి వచ్చే సమస్యల గురించి ఆయన ఆలోచించలేదు. కాంగ్రెస్ హైకమాండ్ తో .. రేవంత్ కు ఏమైనా గ్యాప్ ఉంటే.. ఈ నిర్ణయంతో మరింత పెరిగే అవకాశం ఉందన్నది కొంత మంది భావన. కానీ వాటిని రేవంత్ చక్కదిద్దుకోగలరని.. ఆయన అనుచరులు నమ్మకంతో ఉన్నారు.
