“ రాజకీయాల్లో ఒకే కుర్చీ కోసం 10 మంది పోటీ పడతారు. ఒకరు ఆ కుర్చీలో కుర్చున్నప్పుడు మిగిలిన 9 మంది నిరాశ చెందుతారు. ప్రత్యర్థులు సృష్టించే అపోహలకు లోనై వాటిని వ్యాపింపచేస్తే మన దేశానికి, రాష్ట్రానికి, మనందరికీ నష్టం” అని క్రెడాయ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన ఇలా వ్యాఖ్యానించడానికి బలమైన కారణం ఉంటుందని అనుకుంటున్నారు.
బీఆర్ఎస్, బీజేపీ నేతలు బలంగా ప్రచారం చేస్తున్న సీఎం మార్పు అనే ప్రచారానికి సంబంధించి రియల్ ఎస్టేట్ వర్గాలు గందరగోళంలో ఉన్నాయని రేవంత్ అనుకుంటున్నారు. రాజకీయ అనిశ్చితుల వల్లనే ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులపై ఇంకా నిర్ణయం తీసుకోలేకపోతున్నారని ముఖ్యమంత్రికి ఏమైనా సమాచారం ఉందేమో కానీ.. ఇలా భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారని అంటున్నారు. అయితే ముఖ్యమంత్రి స్వయంగా ఇలా వ్యాపారవేత్తల సమావేశంలో ముఖ్యమంత్రి పదవి గురించి మాట్లాడటం మాత్రం రాజకీయ చర్చలకు కారణం అవుతోంది.
డిసెంబర్ లో సీఎం ను మారుస్తారని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అంటున్నారు. ఆయన అదే మొదటి సారి కాదు. గతంలోనూ చాలా సార్లు అన్నారు. అదో ఊహాగానంగా మిగిలిపోయింది. కానీ బీజేపీ, బీఆర్ఎస్ లో అంతర్గతంగా ఓ ప్రచారం మాత్రం బలంగా జరుగుతోంది. డిసెంబర్ లో బీజేపీ, బీఆర్ఎస్ విలీనం పూర్తవుతుందని.. రేవంత్ పై అసంతృప్తితో ఉండే నేతలు కూడా కలసి వస్తారని అప్పుడు ముఖ్యమంత్రి మార్పు తప్పదని ప్రచారం చేస్తున్నారు. ఇది సీఎం దృష్టికి వచ్చిందేమోనన్న అభిప్రాయం వినిపిస్తోంది.
రాజకీయాల్లో మైండ్ గేమ్ కీలకం. ఆ మైండ్ గేమే చాలా మార్పులకు కారణం అవుతాయి. ఇప్పుడు అలాంటి మైండ్ గేమ్ ఏమైనా జరుగుతోందా అన్న అనుమానాలు కాంగ్రెస్ లో ఉన్నాయి. ఏమైనా రేవంత్ సీఎం పదవిపై రూమర్స్ గురించి క్లారిటీ ఇవ్వడం వల్ల ఇంకా ఎక్కువ చర్చ జరిగే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళన చెందుతున్నారు.