రేవంత్‌ లేఖ చప్పటి ముగింపే

రేవంత్‌ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం ఖాయమని అందరికీ తెలుసు గాని అధినేత చంద్రబాబు నాయుడు కార్యాలయంలో ఆయన లేఖ ఇచ్చి వెళ్లిపోయిన తీరే ఆశ్చర్యంగా కనిపిస్తుంది. లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌కు ఆలస్యంగా వచ్చిన రేవంత్‌ సమక్షంలో అందరూ మొదటి విడత తమ అభిప్రాయాలు చెప్పారు. అప్పటికే ఆలస్యం అయిందన్న తొందరలో వున్న చంద్రబాబు ఎవరూ ఏమీ మాట్లాడొద్దు రేపు అమరావతి రండని పిలిచి వెళ్లిపోయారు. ఈ రోజు కూడా రేవంత్‌ కాస్త ఆలస్యంగానే అమరావతి చేరారు. అప్పటికే తన విదేశీ పర్యటనపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన చంద్రబాబు కూచోండి వస్తానంటూ వెళ్లిపోయారు. ఆయన మీడియాతో మాట్లాడుతుండగానే రేవంత్‌ వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్‌కు లేఖ అందించి వెళ్లిపోయారు. దీనికోసమే అయితే ఇంత సమయం తీసుకోవడం ప్రయాసపడి అక్కడకు వస్తారా?ఈ లోగా ఏమైనా పరిణామాలు లేదా అధినేత తీరు ఆయనకు బాధ కలిగించిందా? లేదంటే తను అనుకున్నట్టు పరిణామాలు జరగడం లేదని అనుకున్నారా? ఏదైనా కావచ్చు. అయితే లేఖలో పార్టీ సీనియర్లను తీవ్రంగానే నిందించిన రేవంత్‌ అధినేత పట్ల పార్టీ పట్ల చాలా గౌరవంగా రాసినట్టు కనిపిస్తుంది. అందుకు తగినట్టే చంద్రబాబు కూడా రేవంత్‌ పేరే ప్రస్తావించకుండా ప్రశ్నలకు సమాధానమిచ్చారు. లేఖ ఇచ్చి వెళ్లారని తెలిసింది ఇంకా చూడలేదు.. రెండుచోట్ల పార్టీ వుంది.ఎలా కాపాడుకోవాలో చూడాలి.ఇలాటివి ఇది వరకు కూడాజరిగాయి. తమ భవిష్యత్తుకోసం ఇలాటివి చేస్తుంటారు అని సున్నితంగానే దాటేశారు. మొత్తంపైన గతంలోనే చెప్పుకున్నట్టు ఇంత సాగదీత తర్వాత ఇది చప్పటి ముగింపే. బహుశా చంద్రబాబుకు మీడియా గోష్టి కలిసి వచ్చింది. రేవంత్‌కు దీన్ని నాటకీయంగా ముగించే అవకాశం లేకపోయింది. తర్వాత చంద్రబాబు టిటిడిపి నేతలతో సమావేశం కానున్నారు. అక్కడ బహుశా రేవంత్‌ నిష్క్రమణ అనంతర పరిణామాలను ఎలా ఎదుర్కొనాలో చర్చించవచ్చు. కాంగ్రెస్‌లో దీనిపై కొంత సంతోషం వున్నా తేదీ ఇంకా చేరిక తేదీ ఖరారు కాలేదు.ఢిల్లీకే వెళ్లాలని యోచిస్తున్నారంటే రాష్ట్రంలో పెద్ద హంగామాకు అవకాశం ఇవ్వలేదని అర్థమవుతుంది. ఒకసారి కాంగ్రెస్‌ ప్రాంగణంలో ప్రవేశించాక వ్యక్తుల జాతకాలు పూర్తిగా అధిష్టానం హస్తగతం చేసుకుంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.