శత్రువు చేతిలో చచ్చిపోవడం వీరత్వం అవుతుంది కానీ.. ఆ శత్రువు చూసి జాలిపడటం అనేది మానసికంగా చంపేస్తుంది. కుంగి కృశించిపోయేలా చేస్తుంది. అందుకే.. ఓటమి తప్పదని తేలిపోయినప్పుడు దయచేసి నన్ను చంపెయ్.. ఈ ఓటమిని, నీ జాలిని నేను తట్టుకోలేను అనే అనే డైలాగులతో ఉన్న క్లైమాక్సులు ఉన్న సినిమాలు చాలా వచ్చాయి. రాజకీయాల్లో పండిపోయిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ను అమలు చేస్తున్నారు. తనను ఎన్నో ఇబ్బందులు పెట్టిన వారిని ఏమీ చేయకుండా వదిలేస్తూ.. అలాగే వ్యవహరిస్తున్నారు. ఆయన ప్రత్యర్థులు తమపై రేవంత్ చూపిస్తున్న జాలి చూసి.. తమ పరిస్థితి ఇలా అయిపోయిందా అని వేదన పడే పరిస్థితి కల్పిస్తున్నారు.
కేసీఆర్ అరెస్ట్ ఉండదు !
“ కేసీఆర్..కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ కుటుంబానికి చర్లపల్లిలో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తా. నువ్ లేకపోతే నీ కొడుకుని అయినా లోపల వేస్తా “ అనే డైలాగులు రేవంత్ నోటి వెంట ఎన్నిసార్లు వచ్చాయో చెప్పడం కష్టం. రేవంత్ రెడ్డిని.. కేసీఆర్ పెట్టిన ఇబ్బందులు గుర్తు ఉన్న వారికి.. ఆయన ఫైర్ కు కారణం ఉందని అనుకుంటారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ పూర్తిగా మారిపోయారు. అరెస్టులు చేసే అవకాశం వచ్చినా ఎవర్నీ చేయడం లేదు. కేటీఆర్ కు సుప్రీంకోర్టులోనూ ఊరట లభించకపోయినా అరెస్టు చేయలేదు. ఇప్పుడు కేసీఆర్ నూ అరెస్టు చేయడం లేదు. అరెస్టు ఉండదని కూడా చెబుతున్నారు.
అది జాలి కాదు రేవంత్ చేస్తున్న మానసిక హింస
ఎన్నికల ఫలితాలను కేసీఆర్ జీర్ణించుకోలేకపోయారని నేరుగా గవర్నర్ కు రాజీనామా పత్రం ఇవ్వడానికి కూడా ఇష్టపడకపోవడంతోనే అందరికీ అర్థమైంది. రేవంత్ సీఎం అవడం ఆయన అసలు అంగీకరించలేకపోతున్నారన్నది బహిరంగసత్యం. అలాంటి సీఎం.. తాను ఆస్పత్రిలో చేరితే.. క్షేమం కోసం వచ్చి పరామర్శించారు. మరోసారి ఆస్పత్రిలో చేరినప్పుడు ప్రభుత్వం తరపున పర్యవేక్షణ చేశారు. అప్పుడు అక్రమాలు జరిగినా అరెస్టు చేయబోనని చెప్పారు. ఫామ్ హౌస్‌లోనే ఆయన జైలు బతుకు బతుకుతున్నారని తేల్చారు. కేసీఆర్ ను ఓడించడమే పెద్ద శిక్ష అనేశారు. ఇలా తను చిన్న పురుగులా చూసిన తన ప్రత్యర్థి తనను ఇలా చూడటం ఎవరైనా భరించగలరా ?. రేవంత్ నేరుగా టార్గెట్ చేయడం కన్నా.. ఇలా రాజకీయంగా జాలి చూపించి దెబ్బతీయడం రేవంత్ స్టైల్ అనుకోవచ్చు.
పగ, ప్రతీకారాల్లో కొత్త పద్దతి
రేవంత్ కు అధికారం వచ్చినా ప్రత్యర్థులపై చర్యల విషయంలో దూకుడు లేదు. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కానీ ఆయన ప్రతీకారం తీర్చుకోవడం లేదని ఎవరూ అనుకోవడం లేదు. ఆ ప్రతీకారం అభ్యంతరకరంగా కూడా లేదు. ప్రజలు వ్యతిరేకించేలా లేదు. ఇంకా చెప్పాలంటే.. దాన్ని ప్రతీకారం అనుకోవడం లేదు. కానీ ప్రత్యర్థుల్ని ఎలా హింస పెట్టాలో అలా పెడుతున్నారు. అధికారం ఉందని నేరుగా చర్యలు తీసుకుంటే .. వాళ్లపై జాలి కలుగుతుంది. ప్రజల్లో సానుభూతి వస్తుంది. అలాంటిది రాకుండా .. తానే మంచివాడ్నని అనిపించుకుని తన ప్రత్యర్థులపై పగ తీర్చుకోవడం రేవంత్ స్టైల్. రాజకీయాలకు కొత్త నడక నేర్పుతున్నట్లే అనుకోవచ్చు.